HYDRAA Ranganath

HYDRAA Ranganath: సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన రంగనాథ్!

HYDRAA Ranganath: హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) చుట్టూ న్యాయపరమైన ఉత్కంఠ నెలకొంది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించి, మరొక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించడం కలకలం రేపింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కమిషనర్ రంగనాథ్ వెంటనే తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి అప్పీల్ దాఖలు చేశారు.

సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు – కీలక వ్యాఖ్యలు..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంట సర్వే నం. 1, 2లోని 40 ఎకరాల భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ జరిపారు. కోర్టు ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించే అధికారి చట్టబద్ధ పాలనను ప్రమాదంలోకి నెట్టేస్తారని, ఆయన్ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించారు.
ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కరణ కేసులు..
ఐజీ ర్యాంకు, కార్యదర్శి స్థాయిలో ఉంటూ ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన ఒకే అధికారిపై ఏడాదిన్నర వ్యవధిలోనే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం అసాధారణమని న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

డివిజన్ బెంచ్‌లో రంగనాథ్ అప్పీల్..

సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అత్యవసర పిటిషన్ వేశారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ వివాదంలో హైడ్రా పూర్తిగా నిబంధనల ప్రకారమే, చట్టపరిధిలోనే వ్యవహరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని, తన విధుల నిర్వహణలో చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఈ అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది, కమిషనర్ రంగనాథ్‌కు ఊరట లభిస్తుందా లేదా అనేది అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *