Mamata Banerjee

Mamata Banerjee: మమతా బెనర్జీపై కేసు నమోదు..!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు తృణమూల్ ఛాత్ర పరిషత్ (TMCP) నిర్వాహకులపై కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. కోల్‌కతాలోని కేథడ్రల్ రోడ్డులో ఆగస్టు 28న నిర్వహించిన టీఎంసీపీ వ్యవస్థాపక దినోత్సవ ర్యాలీ సందర్భంగా కలకత్తా హైకోర్టు నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ మేరకు సబ్-ఇన్‌స్పెక్టర్ అపు బైద్య ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద క్రైమ్ నం. 112/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎఫ్‌ఐఆర్‌లోని ప్రధాన ఆరోపణలు & సెక్షన్లు..
కలకత్తా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించేలా నిర్వాహకులు, మమతా బెనర్జీ నేరపూరిత కుట్రకు (Criminal Conspiracy) పాల్పడ్డారని పోలీసులు ఆరోపించారు. కేథడ్రల్ రోడ్డులోని ఒక వైపు మాత్రమే సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతించగా, కార్యకర్తలు రెండు వైపులా రోడ్డును ఆక్రమించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారని పేర్కొన్నారు.
పోలీసులపై తోపులాట – బారికేడ్ల తొలగింపు: సభకు హాజరైన కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగి బారికేడ్లను తోసివేయడంతో పాటు బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందితో తోపులాటకు దిగారని, దీంతో అక్కడ ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.హైకోర్టు నిర్దేశించిన నిర్దిష్ట సమయ పరిమితిని దాటి సభను కొనసాగించారని పోలీసులు తెలిపారు.
నమోదైన సెక్షన్లు.. బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 61(2) [నేరపూరిత కుట్ర], 223 [ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన], 125(a) [ఇతరుల భద్రతకు ముప్పు కలిగించడం], 132 [ప్రభుత్వ ఉద్యోగులపై దాడి/బలప్రయోగం], 285 [ప్రజా రహదారుల్లో నిర్లక్ష్య ప్రవర్తన] కింద కేసులు పెట్టారు. ఈ ఆరోపణలపై కోర్టు విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *