Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం హయాంలోనే పదో తరగతి పేపర్ లీక్ అయిందని, దీనికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు రేవంత్ తన పదవి నుంచి తప్పుకోవాలని చురకలంటించారు.
1. సింగరేణి నష్టాలకు కాంగ్రెస్, బిఆర్ఎస్ కారణం
సింగరేణి సంస్థ నష్టపోవడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రభుత్వాల తీరే ప్రధాన కారణమని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి దెబ్బతిందని, ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే సింగరేణికి ఒడిశాలోని ‘నైనీ’ కోల్ బ్లాక్‌ను కేటాయించామని గుర్తుచేశారు.
మణుగూరు ‘PKOC’ బ్లాక్ కూడా సింగరేణికే దక్కాలని భావించామని, అయితే దానికి పోటీగా జెన్‌కో (GENCO) రావడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జెన్‌కోను వేలం నుంచి విరమించుకునేలా చూడాలని కోరారు.
2. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశ హితం కోసం ఎలాంటి వ్యవస్థలైనా రావచ్చని, కానీ దేశానికి నష్టం చేసే వ్యవస్థలను ప్రోత్సహించకూడదని ‘నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్’ అని తెలిపారు.
తెలంగాణలో త్వరలోనే భారీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రితో పాటు ఇతర అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తారని వెల్లడించారు.
వరంగల్ విమానాశ్రయానికి భూమి పూజతో పాటు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు.
