Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం (జూలై 18, 2026) జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.162 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, గుంటూరు, నెల్లూరు నగరాల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలను (చెత్త సేకరణ వాహనాలు) ప్రారంభించి, ఉత్తమ కార్మికులకు అవార్డులను అందజేశారు.
1. అక్టోబర్ 2 నాటికి “చెత్త లేని ఏపీ”.. ‘తల్లికి వందనం’ అప్డేట్
రాష్ట్రంలో అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం ప్రకటించారు. చెత్తను కేవలం పారేయడం కాకుండా.. దాని నుండి సంపద సృష్టించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంట్లోనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని కోరారు.
ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల కోసం రూ.528 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆగస్టు 26 నాటికి 1140 ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ‘ప్రజారథం’ ద్వారా చెత్తను కొనుగోలు చేసి నిత్యావసరాలు ఇచ్చే కార్యక్రమానికి రూ.16 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఈ నెలలోనే ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్ర కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
2. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి!
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటిదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం వల్ల పనులు ఆగిపోయినా.. ఇప్పుడు మళ్లీ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేసి దేశానికి (జాతికి) అంకితం చేస్తానని ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.
గతంలో తాము కేవలం 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు 450 టీఎంసీల నీరు ఇచ్చామని గుర్తుచేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేసి కరవు అనేది లేకుండా చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గినా తట్టుకునేలా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, ఆక్వా, పొగాకు రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
3. రౌడీయిజం చేస్తే తోలు తీస్తాం.. క్రిమినల్స్‌పై చంద్రబాబు ఫైర్
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నేరాలు, దోపిడీలు ఎక్కువయ్యాయని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే కుదరదు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని సీఎం హెచ్చరించారు. మాజీ మంత్రి కొడుకు నిర్లక్ష్యంగా యాక్సిడెంట్ చేసి ఒకరి ప్రాణం తీసిన ఘటనను, అలాగే బ్యానర్లు, కటౌట్లకు పొట్టేళ్లను బలి ఇస్తున్న సంస్కృతిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల జీవితాలతో ఆడుకునే క్రిమినల్స్ పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.
సమాజంలో పేద, ధనిక అసమానతలు తొలగించడానికే తాము ‘పీ4’ (P4) విధానాన్ని తెస్తున్నామని.. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
