Crime News

Crime News: యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటి ముందు శవంతో బంధువుల ధర్నా, తాళి కట్టాలని డిమాండ్!

Crime News: గుంటూరు జిల్లాకు చెందిన ఒక యువతి ముంబైలో ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఆమె కుటుంబ సభ్యులు శవంతో ఆందోళనకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడనే ఉద్దేశంతోనే సదరు యువతి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా ప్రేమ.. ముంబైలో ఆత్మహత్య!

గుంటూరు జిల్లా కొండ్రుపాడు గ్రామానికి చెందిన కీర్తి (26) అనే యువతికి.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన సాయి అనే యువకుడితో సోషల్ మీడియా (ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్) ద్వారా పరిచయం ఏర్పడింది.

వీరిద్దరూ గత ఎనిమిది సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే, ఏమైందో ఏమో కానీ.. కీర్తి ఇటీవల ముంబైలో తను ఉంటున్న చోట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయి పెళ్లికి నిరాకరించడం వల్లే ఆమె మనస్తాపంతో చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

ప్రియుడి ఇంటి ముందు శవంతో ఆందోళన!

కీర్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు ముంబై నుండి ఆమె మృతదేహాన్ని నేరుగా ప్రకాశం జిల్లాలోని ప్రియుడు సాయి సొంత ఊరైన పొందూరుకు తరలించారు. కీర్తి చనిపోయే ముందు.. తన చివరి కోరికగా తన మృతదేహానికి సాయితో తాళి కట్టించాలని కోరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకోసం సాయి ఇంటి ఆవరణలోనే ఆమె శవాన్ని ఉంచి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

తాళం పగులగొట్టి నిరసన.. పోలీసుల రంగప్రవేశం

కీర్తి మృతదేహాన్ని తీసుకొస్తున్నారని తెలిసి.. ప్రియుడు సాయి, అతని తల్లిదండ్రులు తమ ఇంటి గేటుకు తాళం వేసి అక్కడి నుండి పరారయ్యారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కీర్తి బంధువులు.. సాయి ఇంటి గేటు తాళాలను పగులగొట్టి, లోపలికి వెళ్లి ఇంటి ముందే కూర్చుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న కీర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరారైన యువకుడు, అతని కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *