Sankranti 2027

Sankranti 2027: అనిల్ రావిపూడి వర్సెస్ హసిత్ గోలి.. తొలిసారి రెండు భారీ మల్టీస్టారర్ల మధ్య బాక్సాఫీస్ పోరు!

Sankranti 2027: తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాల పండగ. ఈ క్రమంలోనే రాబోయే సంక్రాంతి బరిలో ఒక అరుదైన, ఆసక్తికరమైన పోరు జరగబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పటిలాగే మరోసారి సంక్రాంతి రేసుపై కన్నేశారు. ఈసారి ఆయన నందమూరి కల్యాణ్ రామ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. అయితే, బాక్సాఫీస్ వద్ద అనిల్ రావిపూడి సినిమాతో పోటీ పడేందుకు మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా సిద్ధమవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

‘రాజా రాజా చోర’ ఫేమ్ డైరెక్టర్ హసిత్ గోలి ఒక సరికొత్త మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి  ‘వీరాధి వీరులంట’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పండగ సీజన్‌లో విడుదల చేస్తే సినిమాకు భారీగా ఆధరణ లభిస్తుందని భావిస్తున్న చిత్రబృందం.. ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే నిలపాలని చూస్తోంది. ఇదే నిజమైతే థియేటర్ల వద్ద రెండు క్రేజీ మల్టీస్టారర్ సినిమాల మధ్య అగ్రెసివ్ పోటీ తప్పదు.

బాక్సాఫీస్ చరిత్రలోనే తొలిసారి..

సాధారణంగా సంక్రాంతి రేసులో ఇద్దరు స్టార్ హీరోల సింగిల్ సినిమాలు (సోలో చిత్రాలు) పోటీ పడటం మనం చూస్తుంటాం. కానీ, ఇద్దరు ఇద్దరు హీరోలతో కూడిన రెండు వేర్వేరు మల్టీస్టారర్ సినిమాలు ఒకేసారి తలపడటం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి కానుంది.

డైరెక్టర్ హసిత్ గోలి కుటుంబ భావోద్వేగాలను (ఫ్యామిలీ ఎమోషన్స్), కామెడీని నమ్ముకుని సినిమాలు తీస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో రవితేజ, శ్రీవిష్ణు ఇద్దరికీ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ హసిత్‌కు చాలా పెద్ద ప్లస్ కానుంది. అటు అనిల్ రావిపూడి, ఇటు హసిత్ గోలి ఇద్దరి సినిమాలు కూడా ఫుల్ కామెడీ, డ్రామాతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా రాబోతున్నాయి.

ఇప్పటివరకు సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్ సినిమాలను డామినేట్ చేయడం ఏ దర్శకుడి వల్ల కాలేదు. సంక్రాంతి సెంటిమెంట్‌తో అనిల్ ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు సరికొత్తగా రవితేజ, శ్రీవిష్ణులతో వస్తున్న హసిత్ గోలి.. అనిల్ రావిపూడి హిట్టు ఫార్ములాకు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ఈ సంక్రాంతి పోటీ తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని పంచబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *