Ravan

Ravan: Ravan: యూట్యూబర్ ‘రావణ్’ ఫోన్ డేటాలో షాకింగ్ నిజాలు!.. అమ్మాయిల వీడియోలతో బ్లాక్‌మెయిల్..!

Ravan: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘రావణ్’ చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హిందూ దేవతలను, ప్రజలు ఎన్నుకున్న నాయకులను కించపరుస్తూ మాట్లాడినందుకు అతనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఈనెల 1న పిఠాపురం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా, ఆ తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానిని పరిశీలించగా కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.

అయితే, పోలీసులు పట్టుకునే ముందే రావణ్ తన ఫోన్ లోని చాలా వీడియోలను డిలీట్ చేశాడు. దీంతో నిజాలను బయటకు తీసేందుకు పోలీసులు ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తాజాగా ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయకపు యువతులను టార్గెట్ చేసుకుని, వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిసింది. అంతేకాకుండా, వారితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేసేవాడని సమాచారం. ఈ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు దాదాపు 10 మంది బాధితులను గుర్తించారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తిరుగుబాటుకు రెచ్చగొట్టేలా మాట్లాడాడనే ఫిర్యాదుతో కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కూడా రావణ్‌పై కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించాడంటూ అతనిపై దేశద్రోహం (బీఎన్‌ఎస్ 152 సెక్షన్), అలాగే చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద తీవ్రమైన కేసులు పెట్టారు. ఇటీవల అతన్ని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *