EPFO: దేశంలోని కోట్ల మంది ఉద్యోగులకు (PF ఖాతాదారులకు) కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద తీపికబురు చెప్పింది. పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే (విత్‌డ్రా) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సరికొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా, ఇకపై రూ. 5 లక్షల వరకు ఉండే పీఎఫ్ క్లెయిమ్‌లను ఎటువంటి ఆలస్యం లేకుండా ‘ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్’ పద్ధతి ద్వారా ఆటోమేటిక్‌గా ఆమోదించనున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వ్యవస్థ నేటి నుంచే అధికారికంగా ప్రారంభమైంది.
ఈ కొత్త డిజిటల్ మార్పుల వల్ల పీఎఫ్ సేవలు ఇకపై చాలా వేగంగా సాగనున్నాయి. ఇదివరకు పీఎఫ్ డబ్బులు చేతికి రావడానికి వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది, కానీ ఇకపై కేవలం కొన్ని రోజుల్లోనే పని పూర్తవుతుంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరి పీఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ (Centralized Database) పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ ఈపీఎఫ్‌వో ఆఫీస్ ద్వారా అయినా తమ పీఎఫ్ వివరాలను సులభంగా చూసుకోవచ్చు, సేవలు పొందవచ్చు.
మరోవైపు, పీఎఫ్ ఖాతాదారులకు రావాల్సిన వడ్డీ డబ్బులను కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. జూలై 15 నాటికి పీఎఫ్ వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల పీఎఫ్ ఖాతాల్లోకి మొత్తం ₹1.44 లక్షల కోట్ల వడ్డీ డబ్బులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
