Wayanad Landslide

Wayanad Landslide: వాయనాడ్‌లో మళ్లీ విరిగిపడ్డ కొండచరియలు!.. టన్నెల్ ప్రాజెక్ట్ సైట్ వద్ద ఒకరు మృతి.. 7 గురు గల్లంతు.. !

Wayanad Landslide: కేరళలోని వాయనాడ్ జిల్లాలో మంగళవారం ఘోర కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురు అలియాస్ 7 గురు మృత్యుఘోషలో చిక్కుకుని గల్లంతైనట్లు తెలుస్తోంది. కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. కోజికోడ్, వాయనాడ్ జిల్లాలను కలిపే ప్రతిష్టాత్మక అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు (సురంగ రోడ్డు) నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నిర్మాణ స్థలంలో తవ్వకాలు జరపగా వచ్చిన భారీ మట్టి దిబ్బ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. మట్టితో పాటు బండరాళ్లు, పెద్ద పెద్ద చెట్లు కూడా ఒక్కసారిగా ఊడిపడ్డాయి. అక్కడ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్, బారికేడ్లు కూడా కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, బాధితులను కాపాడేందుకు శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి వీ.డీ. సతీశన్ వెల్లడించారు.

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణం..

ఈ ప్రమాదం వెనుక కాంట్రాక్టర్ల ఘోర తప్పిదం ఉందని ముఖ్యమంత్రి సతీశన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో తవ్వగా వచ్చిన భారీ మట్టి మల్బాను వెంటనే అక్కడి నుంచి తరలించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD), జిల్లా యంత్రాంగం చాలా రోజుల క్రితమే కాంట్రాక్టర్లను ఆదేశించాయని ఆయన గుర్తు చేశారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. “అధికారులు హెచ్చరించినా కాంట్రాక్టర్లు ఆ మట్టిని అక్కడి నుంచి తీయలేదు. వారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది” అని స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని.. అధికారుల మాట వినకుండా మట్టిని అలాగే వదిలేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం అన్నారు. ప్రమాదం జరగడానికి ముందు అక్కడ భారీ వర్షం కురిసిందని, ప్రస్తుతం వర్షం వేగం తగ్గినప్పటికీ, పేరుకుపోయిన బురద కారణంగా సహాయక సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు..

ప్రమాద స్థలంలో పోలీస్, ఫైర్ బ్రిగేడ్, విపత్తు నిర్వహణ బృందాలు (SDRF) రంగంలోకి దిగి పనులు చేపట్టాయి. అవసరమైతే ఆర్మీ (డిఫెన్స్ ఫోర్స్) సాయం కూడా తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, వాయనాడ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ (Red Alert) జారీ చేసింది. అంటే రాబోయే 24 గంటల్లో 204 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అర్థం. దీంతో అలర్ట్ అయిన అధికారులు ప్రమాద ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు.

తప్పిన పెద్ద ప్రమాదం..

ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సాధారణ కార్మికులు ఎవరూ పనులు చేయడం లేదు. కేవలం కొద్దిమంది ఇంజనీర్లు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఒకవేళ ఆ సమయంలో పనులు పూర్తిస్థాయిలో జరుగుతుంటే ప్రాణనష్టం ఊహించని పరిధిలో ఉండేదని, పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే, గతంలో జూలై 2024 లో కూడా వాయనాడ్‌లోని ముండక్కై-చూరల్‌మల ప్రాంతంలో సంభవించిన భయంకరమైన కొండచరియల ప్రమాదంలో దాదాపు 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే మేప్పాడి పంచాయతీ పరిధిలోనే మళ్లీ ఈ కొత్త ప్రమాదం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *