Kavitha: టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టాలనుకున్న కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో కొద్దిగా ఊరట లభించింది. ఈ పేరు విషయమై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మే 12, జూన్ 23 తేదీల్లో కవితకు నోటీసులు ఇచ్చింది. ఈ పేరును కేటాయించడం కుదరదని, 15 రోజుల్లోగా వేరే మూడు పేర్లను చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కవిత మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కోర్టు, ఎన్నికల సంఘం నోటీసులపై వారం రోజుల్లోగా తన సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం ఇచ్చింది. కవిత ఇచ్చే సమాధానాన్ని పరిశీలించి, ఆమె మాటలను స్వయంగా విన్న తర్వాతే ఎన్నికల సంఘం దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఎన్నికల సంఘం వాదన:
విచారణలో ఎన్నికల సంఘం లాయర్ మాట్లాడుతూ.. ఇప్పటికే టీఆర్ఎస్ పేరును పోలిన రెండు పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. అందువల్ల కవితకు ఈ పేరు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు తెలిపారు. అంతేకాదు, ఈ పేరుపై ప్రజల నుండి వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని, పాత పార్టీ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరులాగే ఇది కూడా ఉండటంతో గందరగోళం వస్తుందని వివరించారు.
కవిత తరఫు వాదన:
కవిత లాయర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్లో ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఎన్నికల సంఘం మొదట ఒప్పుకుందని గుర్తు చేశారు. కవిత వాదనలు వినకుండానే ఈ పేరు ఇవ్వడం కుదరదని ఈసీ నిర్ణయం తీసుకోవడం సరికాదని కోర్టుకు చెప్పారు.
ఇరుపక్షాల మాటలు విన్న హైకోర్టు, ప్రస్తుతానికి తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్తూనే.. కవిత ఇచ్చే సమాధానాన్ని చూసి, ఆమెతో మాట్లాడిన తర్వాతే ఈసీ ఒక నిర్ణయానికి రావాలని స్పష్టం చేసింది.
