POK: 

POK: మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్‌తో సరిహద్దులు తెరుస్తాం..!

POK: భారత సరిహద్దులకు ఆవల, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ తిరుగుబాటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రావల్కోట్‌లోని ఈద్గా మైదానం వేదికగా.. నియంత్రణ రేఖ (LoC) కు అతి సమీపంలో వేలాది మంది స్థానిక ప్రజలు పాక్ పాలకులకు వ్యతిరేకంగా చారిత్రాత్మక నిరసన ప్రదర్శన చేపట్టారు.

“పీఓకే అసలు పాకిస్థాన్‌లో భాగమే కాదు.. మాకు పాకిస్థాన్ అవసరమే లేదు!” అంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కీలక నాయకుడు సర్దార్ అమ్మాన్ ఖాన్ చేసిన సంచలన ప్రకటనతో ఇప్పుడు ఈ ప్రాంతం ఒక్కసారిగా అట్టుడికిపోతోంది.

“భారత్‌తో వాణిజ్య మార్గాలు తెరుస్తాం జాగ్రత్త!” – పాక్‌కు వార్నింగ్

గత మూడు వారాలుగా రావల్కోట్‌లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలను లొంగిపోయేలా చేయడానికి పాక్ ప్రభుత్వం అత్యంత అమానవీయమైన చర్యలకు దిగింది. స్థానికులకు అందే గోధుమ పిండి, మందులు, నిత్యావసర ఆహార సరఫరాలపై ఇస్లామాబాద్ పాలకులు కఠినమైన ఆంక్షలు (ఆహార దిగ్బంధనం) విధించారని నిరసనకారులు మండిపడ్డారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన జేఏఏసీ నేత అమన్ ఖాన్ పాక్ పాలకులను హెచ్చరిస్తూ.. “మాకు మీ రేషన్లు, పిండి అవసరం లేదు. మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడితే.. భారతదేశంతో (జమ్మూ కాశ్మీర్ వైపు) ఉన్న వాణిజ్య మార్గాలను మేమే స్వయంగా తెరిపించుకుని అక్కడి నుంచే సామాగ్రి తెచ్చుకుంటాం, జాగ్రత్త!” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పీఓకే ప్రజలు భారతదేశం వైపు చూస్తున్నారనడానికి ఇది స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

38 సూత్రాల డిమాండ్.. ఇంటర్నెట్ కట్.. ఉగ్రవాద కేసులు!

ఈ ప్రజా ఉద్యమం కేవలం ఆహార కొరత వల్లే రాలేదు, దీని వెనుక దశాబ్దాల అణచివేత ఉంది. నిరసనకారులు పాక్ ప్రభుత్వం ముందు 38-సూత్రాల డిమాండ్ల చార్టర్‌ను ఉంచారు. అందులోని ప్రధానాంశాలు మరియు పాక్ క్రూర వైఖరి ఇక్కడ చూద్దాం..

  • విద్యుత్ దోపిడీ: పీఓకే పరిధిలోనే భారీగా జలవిద్యుత్ (Hydro power) ఉత్పత్తి అవుతున్నప్పటికీ, ఆ కరెంట్‌ను పాకిస్థాన్‌లోని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ.. ఇక్కడి స్థానిక ప్రజలపై మాత్రం ఆకాశాన్నంటే రేంజ్‌లో కరెంట్ బిల్లుల భారం మోపుతున్నారు.

  • ఉగ్రవాద చట్టాల ప్రయోగం: ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం ‘జేఏఏసీ’ సంస్థను నిషేధిత జాబితాలో పెట్టింది. ఉద్యమ నేత అమన్ ఖాన్‌తో పాటు వందలాది మందిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అక్రమ కేసులు నమోదు చేసింది.

  • డిజిటల్ బ్లాక్‌అవుట్: పీఓకేలో జరుగుతున్న సైనిక అరాచకాలు, ప్రజల నిరసనల దృశ్యాలు అంతర్జాతీయ మీడియాకు చిక్కకుండా ఉండేందుకు జూన్ ఆరంభం నుంచే అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది.

పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలతో పెరిగిన మంట

వివాదాస్పద వ్యాఖ్య: “రావల్కోట్, మీర్‌పూర్ ప్రాంతాల్లో నివసించే వారు అసలైన కాశ్మీరీలే కారు” అంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన అవమానకర వ్యాఖ్యలు ఈ నిరసనల ఉధృతికి మరింత ఆజ్యం పోశాయి.

దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇస్లామాబాద్‌లోని సైనిక నియంతృత్వాన్ని తాము అస్సలు అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాల ముందు సింధు జలాల ఒప్పందంపై మొసలి కన్నీరు కారుస్తూ.. లోపల మాత్రం పీఓకేలో తమ సొంత ప్రజలపైనే ఆహార, సమాచార దిగ్బంధనం విధించిన పాకిస్థాన్ ద్వంద్వ నీతి (Double Standards) ఇప్పుడు ప్రపంచం ముందు నగ్నంగా బయటపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *