Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ’ కార్యాచరణ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అంతర్గత బలోపేతంపై దిశానిర్దేశం చేయడంతో పాటు, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ శైలిపై ఇంకా సమాజంలో ఉన్న కుల రాజకీయాలపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్సీపీ నాయకులు ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అర్ధవంతమైన చర్చలు జరపరని.. కేవలం ఎదుటివారిని వ్యక్తిగతంగా దూషించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గతంలో కాకినాడకు చెందిన ఓ వైఎస్సార్సీపీ నేత తనను ఎంత దారుణంగా, అసభ్యకరంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలంతా చూశారని ఆయన గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినప్పటికీ, ఆ పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు రాలేదని, ఇంకా అదే అహంకారంతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఇదే సమయంలో, తన పార్టీ నేత పంతం నానాజీ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అలాంటి భాషను లేదా ధోరణిని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని జనసేనాని స్పష్టం చేశారు. తన జీవితంలో కుల రాజకీయాలకు ఎప్పుడూ తావివ్వబోనని తేల్చిచెప్పారు.
కులాల పేరుతో సమాజాన్ని విడగొట్టే సంస్కృతి మారాలని కోరుకున్న పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా ఒక విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పేరిట విడివిడిగా వేర్వేరు హాస్టళ్లు ఉండటం సరైన పద్ధతి కాదన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల మధ్య కుల విభేదాలు రాకుండా ఉండాలంటే, విద్యార్థులందరికీ ఒకే ఉమ్మడి హాస్టల్ (కామన్ హాస్టల్) విధానం ఉండాలని తాను బలంగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కులాలను అడ్డుపెట్టుకుని తాను ఎన్నడూ రాజకీయం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని ఆయన రీకన్ఫర్మ్ చేశారు.
పార్టీ కమిటీల ఏర్పాటు ఇంకా భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన ప్రతి ఒక్కరి వివరాలను పారదర్శకంగా సేకరించడమే ఈ కమిటీల ప్రధాన బాధ్యత అని వివరించారు. కమిటీల ఎంపికపై కొందరు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఎవరెవరు ఎన్ని ఏళ్లుగా నిబద్ధతతో శ్రమిస్తున్నారనే అంశాలను పూర్తిస్థాయిలో బేరీజు వేసుకున్న తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. కష్టపడిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని జనసేన పార్టీ ఖచ్చితంగా గుర్తించి గౌరవిస్తుందని, సేకరించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని నిరంతరం తన దృష్టికి తీసుకురావాలని నిర్మాణ సారథులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
