Weather Report

Weather Report: తెలంగాణకు వారం రోజుల పాటు భారీ వర్ష సూచన.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

Weather Report: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే వారం రోజుల పాటు జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని, అక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది.

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, యాదాద్రి భువనగిరిలతో పాటు రాజధాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డిలలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. వానతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే దట్టమైన మబ్బులు కమ్ముకుని ఆకాశం మేఘావృతమై ఉంది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి తేలికపాటి నుండి మోస్తరు ఝల్లులు పడే అవకాశం ఉంది. అయితే, సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్షం జోరందుకుంటుందని, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగే ప్రయాణికులు రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండటం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *