Holiday: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ ఒక శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై కొన్ని రోజులు కూడా గడవక ముందే విద్యార్థులకు పండుగ సెలవు దొరికింది. జూన్ 26వ తేదీన రానున్న మొహర్రం పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారికంగా సెలవు ప్రకటించాయి. దీంతో వేసవి సెలవులు ముగిసి ఇప్పుడిప్పుడే మళ్లీ పుస్తకాల సంచులు సర్దుతున్న చిన్నారులకు ఈ వారం పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈ అధికారిక ప్రకటనతో విద్యార్థులకు ఈ వారంలో దాదాపు వరుస సెలవులు వచ్చిన వాతావరణం కనిపించనుంది. రేపు ఒక్కరోజు మాత్రమే బడికి వెళ్తే.. ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం నాడు మొహర్రం సెలవును హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఆ తర్వాత శనివారం ఒక్కరోజు మాత్రమే స్కూళ్లు నడుస్తాయి, మళ్లీ ఆదివారం ఎలాగూ సాధారణ వీక్లీ హాలిడే వచ్చేస్తుంది. ఈ విధంగా పాఠశాలలు తెరిచిన ప్రారంభంలోనే ఇలాంటి మినీ వెకేషన్ దొరకడంపై అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు మొహర్రం సందర్బంగా జూన్ 25వ తేదీని ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా కేటాయించింది. అయితే జూన్ 26న మాత్రం రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలన్నింటికీ ఖచ్చితంగా సాధారణ సెలవు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. కొత్త క్లాసుల సందడి మధ్యలో వచ్చిన ఈ పండుగ బ్రేక్ చిన్న పిల్లలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
