Pawan Kalyan: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నిర్వహిస్తోన్న ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ మూడు రోజుల సభలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సదస్సులో తొలిరోజు పాల్గొన్న పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాతీయ సమైక్యత, దేశభక్తిపై స్పందిస్తూనే.. సమకాలీన రాజకీయాలపై అత్యంత ఘాటుగా విమర్శలు గుప్పించారు. జాతీయవాదాన్ని పక్కనబెట్టి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే శక్తులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’పై పవన్ విమర్శల బాణాలు.
ప్రస్తుత రాజకీయాల్లో కొందరి స్వార్థపూరిత వైఖరిని ఎండగట్టడానికి పవన్ కల్యాణ్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party – CJP) అనే సరికొత్త పదాన్ని ఉపయోగించి విమర్శలు గుప్పించారు.
“జాతీయవాదాన్ని పూర్తిగా పక్కనపెట్టి.. చిన్న చిన్న అభిప్రాయాలు, కురచ భావాలు, కేవలం వ్యక్తిగత లాభాల కోసం ప్రాకులాడే వ్యక్తుల వల్లే ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీల వంటివి పుట్టుకొస్తున్నాయి” అని పవన్ మండిపడ్డారు. దేశ సమగ్రతను తమ స్వార్థం కోసం బలి చేసేందుకు కొన్ని శక్తులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని ఆయన ఆరోపించారు.
సుమతీ శతకం గుర్తుకొచ్చింది – పవన్ విశ్లేషణ.
తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ తెలుగు సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ కార్యకర్తలలో ఆలోచనను రేకెత్తించారు.
“చిన్న చిన్న చీమలు అన్నీ ఒకటైతే.. ఎంత బలమైన సర్పానైనా (పామునైనా) చంపేయగలవు అనే సుమతీ శతక పద్యం నాకు ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది. సమాజంలో చాలామంది చిన్న చిన్న శక్తులు ఏకమైతే.. అది మంచైనా, చెడైనా చాలా బలంగా మారుతుంది” అని పవన్ అభిప్రాయపడ్డారు.అలాంటి సంకుచిత ఆలోచనా ప్రవాహంలో జనసేన ఎప్పటికీ చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే.. ఈ సభను ప్రత్యేకంగా ఢిల్లీలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
విభజనవాదానికి వ్యతిరేకంగా పోరాటం.
రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ప్రాంతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై పవన్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా విభజనవాదం బలపడకూడదు అన్న ముఖ్యమైన విషయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడానికే ఢిల్లీని వేదికగా ఎంచుకున్నట్లు పవన్ తెలిపారు. జనసేన సిద్ధాంతాల్లో జాతీయ సమగ్రత, దేశభక్తి అనేవి అత్యంత కీలకమైన అంశాలని ఆయన పునరుద్ఘాటించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే విభజనవాద శక్తులకు వ్యతిరేకంగా జనసైనికులు నిరంతరం పోరాడాలని పవన్ కల్యాణ్ ఈ వేదికగా పిలుపునిచ్చారు.
