Pawan Kalyan: హైదరాబాద్‌లో జనసేన పార్టీ సమావేశానికి అనుమతి నిరాకరణపై రేగిన వివాదం సర్దుమణగక ముందే.. జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సరికొత్త రాజకీయ వ్యూహాలకు తెరలేపారు. జూన్ 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న జనసేన జాతీయ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం (జూన్ 15) పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సీనియర్ లీడర్లతో పవన్ కళ్యాణ్ ఒక అత్యంత కీలకమైన సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
భారత జాతీయవాదానికి కేంద్రబిందువైన ఢిల్లీలో ఈ సదస్సు నిర్వహించడం ద్వారా.. ప్రాంతీయ ఆకాంక్షలను కాపాడుకుంటూనే దేశ సమగ్రతను ఎలా బ్యాలెన్స్ చేయాలనే అంశంపై పార్టీ శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్ వివాదం బ్యాక్‌డ్రాప్:
తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లో జనసేన మీటింగ్ పెట్టాలని భావించగా.. భద్రతా కారణాలు, శాంతిభద్రతల సమస్యలను సాకుగా చూపుతూ తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.
పోలీసుల నిర్ణయంపై పవన్ కళ్యాణ్ గతంలో తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా మారుతోందంటూ ఆయన చెప్పారు.
-
తెలంగాణపై ఫోకస్: 2023 తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే కార్యకర్తల కోరిక మేరకు తాను త్వరలోనే మళ్లీ తెలంగాణలో పర్యటిస్తానని, 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా బరిలోకి దిగుతుందని పవన్ ప్రకటించారు.
-
కోర్టును ఆశ్రయించిన జనసేన: కాగా, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై జనసేన శ్రేణులు పోలీస్ కేసులు పెట్టిన ఉదంతం వల్ల శాంతిభద్రతల సమస్య వచ్చే ఛాన్స్ ఉందంటూ పోలీసులు సభను అడ్డుకోగా.. ఇది కేవలం అంతర్గత సంస్థాగత సమావేశమేనని, ఆంక్షలు అవసరం లేదంటూ జనసేన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
ఢిల్లీ వేదికగా ‘నేషనల్ ప్లాన్’:
జనసేన పార్టీ స్థాపించి దశాబ్ద కాలం దాటిన తరుణంలో.. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా పక్క రాష్ట్రాలకూ సంస్థాగతంగా విస్తరించడమే లక్ష్యంగా ఈ ఢిల్లీ పర్యటన ప్లాన్ చేశారు.
-
దక్షిణాది నేతల హాజరు: ఈ సమావేశానికి ఏపీ ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి ఇటీవల జనసేనలో చేరిన పలువురు సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు.
-
“సేన గర్జన” లక్ష్యాలు: మూడు రోజుల పాటు జరిగే ఈ స్ట్రాటజీ సెషన్స్‌లో జాతీయ రాజకీయాల్లో ఎదురవుతున్న సవాళ్లు, ప్రాంతీయ సమీకరణాలపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే ప్రతిష్టాత్మక “సేన గర్జన” ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశాలను, యాక్షన్ ప్లాన్‌ను పవన్ కళ్యాణ్ ఈ వేదికగా లీడర్లకు వివరించనున్నారు.
సొంత రాష్ట్రంలో పరిపాలనా బాధ్యతలను చూసుకుంటూనే, పవన్ కళ్యాణ్ తన పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి వేస్తున్న అడుగులు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ మూడు రోజుల మేధోమథనం తర్వాత జనసేన భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
