Maha Conclave in Vijayawada

Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల సంచలనం

Maha Conclave in Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష వైసీపీకి ‘నాగలికి, గొడ్డలికి’ ఉన్నంత వ్యత్యాసం ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ లో మహా న్యూస్ నిర్వహిస్తున్న ‘మహా కాంక్లేవ్’ కార్యక్రమంలో  పాల్గొన్న ఆయన.. గత జగన్ ప్రభుత్వ విధ్వంసకర పాలనపై, పోలవరం ప్రాజెక్టును ముంచేసిన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ మీదకు తెచ్చిన వైసీపీని కాదని, ప్రజలు 95 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి అఖండ విజయాన్ని అందించారని ఆయన గుర్తుచేశారు.

1. “వైసీపీ ఒక గొడ్డలి పార్టీ.. జగన్‌కు మానవత్వం లేదు!”

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు రాజకీయంగా ఘాటు విమర్శలు గుప్పించారు:

  • పెన్షన్ల మోసం: “గత వైసీపీ ప్రభుత్వం వృద్ధుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంది. కానీ మా కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెరిగిన మొత్తంతో కలిపి రూ. 7,000 పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల చేతుల్లో పెట్టింది.

  • దివ్యాంగుల ఫించన్: వైఎస్ జగన్‌కు మానవత్వం గురించి మాట్లాడే అర్హతే లేదని మంత్రి మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో దివ్యాంగుల రూ. 3,000 ఫించన్‌ను జగన్ ఒక్క రూపాయి కూడా పెంచలేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రూ. 6,000 కు పెంచి తమ చిత్తశుద్ధిని చాటుకుందని స్పష్టం చేశారు.

  • ఆస్తులు & అవినీతి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్ ఆస్తి లక్షల్లో ఉంటే, ఆ తర్వాత అక్రమంగా వేల కోట్లు సంపాదించారని, సీబీఐ విచారణలోనే రూ. 43,000 కోట్ల అక్రమాస్తుల భాగోతం తేలిందని మంత్రి ఆరోపించారు. అధికారమిస్తే తన సొంత సంపాదన పెంచుకోవడానికే జగన్ వాడుకున్నారని, అందుకే జనం 151 సీట్ల నుండి 11 స్థానాలకు పరిమితం చేసి సరైన బుద్ధి చెప్పారన్నారు.

2. “2027 లో పోలవరం పూర్తి – ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం!”

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలకమైన టైమ్‌లైన్ మరియు అప్‌డేట్‌లను ప్రకటించారు:

  • వృథా అవుతున్న నీరు: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల ప్రతి ఏటా సుమారు 3,000 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే శ్రీకాకుళం నుండి రాయలసీమ వరకు నీరందించవచ్చన్నారు.

  • డయాఫ్రమ్ వాల్ నిర్మాణం: 2014-19 మధ్య టీడీపీ హయాంలో 72 శాతం పోలవరం పనులు పూర్తయితే, జగన్ రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 400 కోట్ల విలువైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు అదే డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ. 1,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని, అయినప్పటికీ పట్టుదలతో ఈ ఏడాది మార్చి 2 నాటికే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు.

  • డెడ్‌లైన్ ఫిక్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని.. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును వంద శాతం పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల ధీమా వ్యక్తం చేశారు.

3. “వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ చెప్పేవన్నీ దగా, అబద్ధాలే!”

గతంలో వైఎస్ జగన్ జాతికి అంకితం చేసిన వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల సంచలన నిజాలను బయటపెట్టారు:

“వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశానని జగన్ చెప్పడం పెద్ద మోసం. అక్కడ కనీసం ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు. 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ పూర్తి కాలేదు, టన్నెల్-1 లో ఎర్త్ వర్క్ పూర్తి కాలేదు, ఇంకా 7 కిలోమీటర్ల మేర లైనింగ్ వర్క్ పెండింగ్‌లోనే ఉంది. బటన్ నొక్కితే నీళ్లు రావు కాబట్టే, కేవలం ఒక స్థూపాన్ని ఏర్పాటు చేసి ఓపెన్ చేశానని జగన్ నాటకమాడారు.”నిమ్మల రామానాయుడు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి

కూటమి 15 నుండి 20 ఏళ్లు అధికారంలో ఉంటుంది:

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా 25 కేసులు పెట్టి, మారణాయుధాలతో దాడులు చేసినప్పటికీ భయపడలేదని, తన ఆలోచన ఎప్పుడూ పాలకొల్లు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పైనే ఉంటుందని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ తప్పు చేస్తే వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారని, ప్రజలతో మరింత మమేకం అవుతున్నారని చెప్పారు. రాష్ట్ర వికాసం కోసం రాబోయే 15 నుండి 20 ఏళ్ల పాటు, అలాగే 2029 ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *