CM Revanth Reddy: తెలంగాణను ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కేవలం 150 రోజుల్లోనే ఈ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం మన రాష్ట్రం కోసమే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించేలా దీనిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
వచ్చే ఎనిమిదేళ్లలో న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ (లక్ష కోట్ల డాలర్ల) ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఈ ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో నిజాం రాజులు, కులీకుతుబ్ షా కాలం నుండి హైదరాబాద్ నగరం విస్తరిస్తూనే ఉందని, ఆ విస్తరణ వల్లే ఈరోజు ప్రపంచ పటంలో నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు బంగారం ధర కంటే ఎక్కువగా ఉన్నాయంటూ అక్కడి భూముల డిమాండ్‌ను సీఎం ఉదహరించారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR), జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసినట్లే.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కూడా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు ఐటీ రంగాన్ని విస్తరించకపోతే ఈరోజు 10 లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడ ఉండేవారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, అది ఒక రద్దయిన నోటు లాంటిదని ఎద్దేవా చేశారు. తమ వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోవడంపై కూడా సీఎం స్పందించారు. నగరంలో చెరువులు, కుంటలు కబ్జాకు గురికావడం వల్లే వర్షపు నీరు రోడ్లపైకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అంబర్‌పేటలోని బతుకమ్మకుంట వంటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. అందుకే తమ ప్రభుత్వం ‘హైడ్రా’ (HYDRAA) ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ, చెరువులను కాపాడుతోందని స్పష్టం చేశారు. చెరువులను పునరుద్ధరించి ‘లేక్ ఎకానమీ’ని తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాల పెట్టుబడులను తెలంగాణకు రప్పిస్తున్నామని, రాబోయే డిసెంబర్లో కూడా మరో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
