Congress-TMC Merge: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ పెద్ద సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? తన సొంత పార్టీ టీఎంసీని కాంగ్రెస్‌లో కలిపేయడానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బెంగాల్లో తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేస్తుంటే.. మమత మాత్రం కోల్‌కతాలో ఉండకుండా ఢిల్లీలో వరుసగా చర్చలు జరపడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది.
దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి ఢిల్లీలో జరిగిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి వచ్చారు. గతంలో కూటమి మీటింగులకు మమత పెద్దగా వచ్చేవారు కాదు, ఎవరో ఒకరిని ప్రతినిధిగా పంపేవారు. కానీ, ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై, పార్టీ ముక్కలయ్యే ప్రమాదం రావడంతో ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. మంగళ, బుధవారాల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో మమత, అభిషేక్ విడివిడిగా అత్యవసర సమావేశాలు జరిపారు. ఈ భేటీల వెనుక టీఎంసీ భవిష్యత్తును కాపాడుకునే పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఎన్నికల ఓటమితో కుప్పకూలిన సామ్రాజ్యం
గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌ను ఒంటిచేత్తో ఏలిన మమతా బెనర్జీకి మే 4న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. అవినీతి, దౌర్జన్యాలపై బెంగాల్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. 294 సీట్లున్న అసెంబ్లీలో టీఎంసీ కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఈ ఘోర ఓటమితో పార్టీలో తిరుగుబాటు మొదలైంది. దాదాపు 100 మందికి పైగా మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేయగా, రితబ్రతా బెనర్జీ నాయకత్వంలో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు మమతకు ఎదురు తిరిగారు. అటు లోక్‌సభలోనూ 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. కేవలం నెల రోజుల్లోనే పార్టీపై మమత పట్టు కోల్పోయారు. కోర్టులకు వెళ్లినా సంఖ్యాబలం లేకపోతే లాభం లేదని ఆమెకు అర్థమైంది.
అయితే, ఈ విలీన వార్తలపై తిరుగుబాటు నేత రితబ్రతా బెనర్జీ గట్టిగా స్పందించారు. తమ వైపు ప్రస్తుతం 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఉన్నారని.. తామెవ్వరం టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ఒప్పుకోమని స్పష్టం చేశారు. మరి అలాంటప్పుడు విలీనం ఎవరి కోసం అని ఆయన ప్రశ్నించారు. కానీ, తిరుగుబాటుదారులు తన ప్రాణసమానమైన పార్టీ పేరును, గుర్తును లాక్కోకుండా చూసుకోవడానికి మమతకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్‌లో విలీనం కావడమేనని విశ్లేషకులు అంటున్నారు. దీనివల్ల ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయ భవిష్యత్తుకు కూడా రక్షణ దొరుకుతుంది.
విలీనానికి పెరుగుతున్న మద్దతు
ఈ విలీన ప్రతిపాదనను పలువురు జాతీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు కూడా సమర్థిస్తున్నారు. బీజేపీని బలంగా ఎదుర్కోవాలంటే.. గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ మళ్లీ మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌లో కలిసిపోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్టులు ప్రభు చావ్లా, రాజ్‌దీప్ సర్దేశాయ్ వంటి వారు కూడా.. బలహీనమైన కూటముల కంటే, కాంగ్రెస్ నుంచి పుట్టిన ఈ పార్టీలన్నీ మళ్లీ ఏకమైతేనే ప్రతిపక్షం బలోపేతం అవుతుందని, అది అటు కాంగ్రెస్‌కు, ఇటు సంక్షోభంలో ఉన్న టీఎంసీకి మేలు చేస్తుందని విశ్లేషిస్తున్నారు.
గతంలో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్‌లో నమ్మకమైన నాయకురాలిగా ఉన్న మమత.. 1997లో బెంగాల్ కాంగ్రెస్ నేతలతో గొడవల వల్ల బయటకు వచ్చి 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఆ తర్వాత 2011లో లెఫ్ట్ ఫ్రంట్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాలచక్రం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్‌ను లేకుండా చేసిన టీఎంసీ.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి అదే కాంగ్రెస్ శరణు కోరుతుండడం విశేషం. నిఖార్సైన పోరాట యోధురాలైన మమతా బెనర్జీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ ధర్మసంకటంలో విలీనమే ఆఖరి దారిలా కనిపిస్తోంది. దీనిపై రాబోయే రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.
