Crime News

Crime News: సినిమాని మించిన ప్లాన్.. భార్య హత్యకు సుపారీ ఇచ్చిన భర్త.. కేసు ఛేదించిన కూరగాయల సంచి!

Crime News: సినిమాని మించిన ప్లాన్ తో భార్యని హతమార్చడానికి బీహార్ కి చెందిన నలుగురికి సుపారీ ఇచ్చాడు, భార్యని చంపించాడు. తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు తన భార్యని హతమార్చారు అంటూ కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం ఠాణా పరిధిలో జరిగిన వివాహిత హత్య కేసును ఛేదించారు. కట్టుకున్న భర్తనే భార్యను చంపించాడని తేల్చారు. అలాగే దుండగులలో ఒకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. కానీ ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒక కూరగాయల సంచి ఎంతగానో ముఖ్య పాత్ర పోషించింది.

కేసు వివరాల్లోకి వెళ్తే..

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో బీహార్ కి చెందిన అనిల్ కుమార్ ఇంకా తన భార్య మీనాదేవి (35) దంపతులు నివాసం ఉంటుండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఓ స్టీల్ తయారీ చేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, అలాగే వాహనాలు కూడా అద్దెకి ఇచ్చేవాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవు. దీంతో సహనం కోల్పోయిన భర్త ఎలాగైనా భార్యను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. తన చేతులకి రక్తం అంటకుండా పక్కా ప్లాన్ చేసుకున్నాడు.. బీహార్ కి చెందిన నలుగురితో డీల్ మాట్లాడి, ఎక్కడ ఎలా హతమార్చాలో అన్ని నిర్ణయించుకున్నారు.

ప్లాన్ ప్రకారం మే 30వ తేదీ సాయంత్రం ఐడీఏ బొల్లారం పరిధిలో జరుగుతున్న సంతకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. ఎవరూ లేని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో బైక్ ని ఆపేసి రిపేర్ చేస్తున్నట్టు నటించాడు. ఆ సమయంలో బీహార్ గ్యాంగ్ వచ్చి ఆమె గొంతు కోసి హత్య చేశారు..

పోలీసులను నమ్మించేందుకు కట్టుకథ:

ఇక్కడి నుండే భర్త పోలీసులకు చిక్కకుండా ఇంకో ప్లాన్ అమలుచేయడం మొదలు పెట్టాడు.. పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ తన భార్యని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్టు చెప్పాడు.. ఘటన గురించి వివరిస్తూ.. ఇంటికి వచ్చే సమయంలో బండి ట్రబుల్ ఇవ్వడంతో ఒక ప్లేసులో బైక్ ని ఆపి రిపేర్ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వచ్చి తన భార్యని పొదల్లోకి లాకెళ్లారు అని, అది చూసి భయంతో తాను కొంత దూరం పరిగెత్తానని చెప్పాడు. తర్వాత మళ్లీ తిరిగి బైక్ ఉన్న ప్లేస్ కి వెళ్లేసరికి వాళ్లు తన కళ్లముందే తన భార్య గొంతు కోసి చంపారని, మధ్యలో వెళ్లినందుకు తనపైన కూడా దాడి చేసినట్టు పోలీసులకు వివరించాడు..

ట్విస్ట్ ఇచ్చిన కూరగాయల సంచి:

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అక్కడ ఏదీ సరిగా అనిపించలేదు, ఇంకో పక్క భర్తను చూస్తుంటే అనుమానం ఇంకా ఎక్కువైంది.. అప్పుడే పోలీసులకు ఒక క్లూ దొరికింది. వాళ్లు కూరగాయలు కొనుక్కొని వస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. హత్య చేయడానికి ఆమెను బైక్ ఉన్న చోటు నుండి పొదల్లోకి లాగారు కానీ, కూరగాయల సంచి మాత్రం ఎవరో పద్ధతిగా పక్కన పెట్టినట్టు పక్కనే ఉంది. భర్త చెప్పింది నిజమైతే, ఆమెను బలవంతంగా లాగికెళ్లినప్పుడు ఆ కూరగాయలన్నీ కింద పడిపోవాలి.. కానీ అలా జరగలేదు. దీనిపైన అనుమానం రావడంతో పోలీసులు భర్తను తమదైన శైలిలో విచారించగా మొత్తం విషయం బయటికి వచ్చింది.

అనిల్‌తో పాటు సుపారీ గ్యాంగ్‌లో ఉన్న ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *