Delhi Professor:

Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!

Delhi Professor: ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) మహిళా ప్రొఫెసర్‌ దేవోస్మిత పాల్‌ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం నాడు ఈ దారుణం వెలుగులోకి రాగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఈ మిస్టరీని ఛేదించారు. ప్రొఫెసర్‌కు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతులే ఈ దారుణమైన హత్యకు పాల్పడినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

హత్యకు దారితీసిన కోట్ల ఆస్తి వివాదం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొఫెసర్‌ దేవోస్మిత పాల్‌కు తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఒక ఇిల్లు (ఆస్తి) పశ్చిమ బెంగాల్‌లో ఉంది. దీని విలువ మార్కెట్లో కోట్లలో ఉంటుంది. ఈ ఇంట్లో కొన్నేళ్లుగా ఒక స్థానిక దంపతులు అద్దెకు ఉంటున్నారు. అయితే, కాలక్రమేణా ఆ కోట్లాది రూపాయల విలువైన ఇంటిని తామే పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఆ అద్దె దంపతులు ప్లాన్ చేశారు.

ఈ విషయాన్ని గమనించిన ప్రొఫెసర్ దేవోస్మిత.. ఇల్లు ఖాళీ చేయాలంటూ కొంతకాలంగా వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా ఆ ఆస్తిని దక్కించుకోవాలంటే ఆమెను రూట్ నుంచి తప్పించడమే ఏకైక మార్గమని భావించిన దంపతులు.. ఆమెను హత్య చేయడానికి స్కెచ్ వేశారు.

ముసుగులు ధరించి.. బిడ్డతో సహా వచ్చి!

దేవోస్మిత భర్త ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటుండగా.. ఆమె ఢిల్లీలోని ‘సత్యం అపార్ట్‌మెంట్స్‌’ లోని ఒక ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిందితులు బెంగాల్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.

  • లిఫ్ట్ వాడకుండా స్కెచ్: బుధవారం ఢిల్లీకి చేరుకున్న నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా, ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగులు ధరించి దేవోస్మిత ఫ్లాట్ వద్దకు వచ్చారు. తాము హంతకులమని ఎవరూ అనుకోకుండా ఉండేందుకు తమ చిన్న బిడ్డను కూడా వెంట తెచ్చుకున్నారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాలకు దొరక్కుండా ఉండేందుకు 6వ అంతస్తుకు లిఫ్ట్‌కు బదులుగా మెట్ల మార్గంలో వెళ్లారు.

  • హత్య తర్వాత బట్టలు మార్చుకుని ఎస్కేప్: ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం తమతో తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ప్రొఫెసర్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం రక్తపు మరకలైన తమ బట్టలను అక్కడే మార్చుకుని, 30 నిమిషాల తర్వాత ఒక క్యాబ్ బుక్ చేసుకుని పరారయ్యారు.

క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన క్లూతో అరెస్ట్!

హత్య జరిగిన ఫ్లాట్ పరిసరాలను గాలించిన పోలీసులు.. నిందితులు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్‌ను గుర్తించి విచారించారు. సదరు ప్రయాణికులు బెంగాలీ భాషలో మాట్లాడుకుంటున్నారని, వారు బెంగాల్‌కు చెందిన వారని డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ లో నిందితులైన దంపతులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *