Harish Rao

Harish Rao: గోదావరి నీళ్లపై కుట్రలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది

Harish Rao: తెలంగాణ సమాజానికి రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని, నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం గతంలో తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కేవలం బీఆర్ఎస్ చేసిన గట్టి పోరాటం వల్లే ఆగిపోయిందని ఆయన గుర్తుచేశారు. నదీ జలాల దోపిడీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని నిద్రలేపేందుకే తాము ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు.

ఏపీ కొత్త ప్లాన్.. తెలంగాణకు తీవ్ర నష్టం!

గతంలో ఏపీ ప్రభుత్వం వేసిన గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla), గోదావరి-నల్లమల్ల (Godavari-Nallamala) సాగర్ వంటి రెండు ప్లాన్లు విఫలమయ్యాయని హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా నదుల అనుసంధానం పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావేరి-గోదావరి లింక్ రాగం అందుకుంటూ మరో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు.

  • కేంద్ర నిధులతో మళ్లింపు: ఈ ప్లాన్ ద్వారా ఏపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, నేషనల్ ప్రాజెక్టు (National Project) కింద కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్‌లోకి సులభంగా మళ్లించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

  • తెలంగాణకు శూన్యం: ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా రాకుండా పోతుందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

  • 47 టీఎంసీలు గోవిందా: అంతేకాకుండా, తెలంగాణకు చెందిన సమ్మక్క సాగర్ నుంచి 47 టీఎంసీల నీటిని కూడా పూర్తిగా వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు గోదావరి నదిలో మిగులు జలాలే లేనప్పుడు, ఏపీ కొత్తగా ప్రాజెక్టులు ఎలా కడుతుందని ఆయన ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌పై ‘గురుదక్షిణ’ ఆరోపణలు!

తెలంగాణకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ‘డూడూ బసవన్నలాలా’ తలలూపుతున్నారని హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

తన రాజకీయ గురువైన చంద్రబాబు నాయుడి కళ్లల్లో ఆనందం చూడటం కోసమే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. గోదావరి నీళ్లను ఆయనకు ‘గురుదక్షిణ’గా ఇవ్వాలని చూస్తున్నారు. దీనిపై సూటిగా ప్రశ్నిస్తే రేవంత్ దగ్గర సమాధానం లేదు.. అందుకే తీట్లు అందుకుంటారు. మమ్మల్ని ఎంత తిట్టినా ప్రశ్నించడం మాత్రం ఆపం.”

గతంలో బీఆర్ఎస్ పెట్టిన ప్రతిపాదనలు ఇవే: హరీష్ రావు

తాము అధికారంలో ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని స్పష్టమైన, పటిష్టమైన ప్రతిపాదనలు పెట్టామని హరీశ్ రావు గుర్తుచేశారు:

  1. తెలంగాణ భూభాగం నుంచే లింక్: నదుల అనుసంధాన నీటిని ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి అది కూడా తెలంగాణ భూభాగం నుంచే తీసుకోవాలని కోరాం. అప్పుడే మన రాష్ట్రం కూడా ఆ గోదావరి నీళ్లను వాడుకునే వీలుంటుంది. అందుకు పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) కూడా అంగీకరించింది.

  2. సగం వాటా ఇవ్వాలి: కావేరీ నదికి తీసుకెళ్లే నీటిలో సగం వాటాను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశామని, గతంలో కేంద్రం కూడా ఈ ప్రతిపాదనలకు ఓకే చెప్పిందని తెలిపారు.

కానీ ఇప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తూ పోలవరం నుంచి నీటిని మళ్లించాలని చూస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని హరీశ్ రావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *