Fire Accident: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపురాన్ ప్రాంతంలోని ప్రసాద్ ఆసుపత్రి ఐదో అంతస్తులో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంటే సుమారు 3:55 గంటల ప్రాంతంలో ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు ఊపిరాడక, గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని కృష్ణందన్ ప్రసాద్ సింగ్ (76), గీతా దేవి (63), ఉదయ్ కుమార్ (57), శశాంక్ (30)గా అధికారులు గుర్తించారు. వీరిలో ముగ్గురు ముజఫర్‌పూర్ జిల్లాకు చెందినవారే కాగా, ఉదయ్ కుమార్ మాత్రం పక్కనే ఉన్న షియోహర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 24 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అందులో 13 మంది అత్యంత విషమ పరిస్థితిలో ఐసీయూలోనే ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, ఆసుపత్రి సిబ్బందితో కలిసి వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న సుమారు 15 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన రోగులను వెంటనే దగ్గరలోని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక దళాలు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు అంటుకుని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ముజఫర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ దారుణ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి, దుఃఖం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నిశాంత్ కుమార్ జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయిన ఘటన మరువక ముందే, ఇప్పుడు ఆసుపత్రిలో ఇలాంటి ప్రమాదం జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
