Minister Narayana: రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఆయన, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. అమరావతిలో పనులు ఎంతో వేగంగా సాగుతుంటే, ఇంకా అక్కడ ఏమీ లేదంటూ జగన్ మాట్లాడటం అర్థరహితమని మండిపడ్డారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక మైలురాళ్లను మంత్రి నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే 2028 ఆగస్టు నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తిగా సిద్ధమవుతాయని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించలేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, నమ్మి భూమి ఇచ్చిన ప్రతి ఒక్క రైతుకూ ప్లాట్లు కేటాయించామని ఆయన వివరించారు. జగన్ కేవలం రాజధానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ వల్లే అమరావతి ఈరోజు ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోందని, కానీ జగన్‌కు ఎలాంటి విజన్ లేదని నారాయణ ఎద్దేవా చేశారు. అమరావతిలో పనులన్నీ పక్కాగా టెండర్ల ప్రకారమే జరుగుతున్నాయని, రైతుల నుంచి ఎక్కడా బలవంతంగా భూములు తీసుకోలేదని స్పష్టం చేశారు. రానున్న నాలుగు నెలల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
