Peddi: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంకా బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో (GO) జారీ చేసింది. ఈ నిర్ణయం భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఊరటనిచ్చినప్పటికీ, థియేటర్లలో సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి జేబుకు మాత్రం అదనపు భారం కానుంది.
సింగిల్ స్క్రీన్ & మల్టీప్లెక్స్ రేట్లు ఇవే:
తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల కేటగిరీలను బట్టి ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది:
-
సింగిల్ స్క్రీన్ థియేటర్లు: సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
-
మల్టీప్లెక్స్ థియేటర్లు: ప్రతి టికెట్ ధరపై అదనంగా రూ. 125 వరకు పెంచుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ రూ. 600!
ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, జూన్ 3వ తేదీ (ఈరోజు) రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల (Special Premiere Shows) టికెట్ ధరను ఏకంగా రూ. 600 వరకు విక్రయించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. చరణ్ కెరీర్లోనే ఇవి అత్యంత ఖరీదైన ప్రీమియర్ షో టికెట్ ధరలుగా నిలవనున్నాయి.
గరిష్టంగా 10 రోజులు మాత్రమే ఛాన్స్:
అయితే ఈ టికెట్ ధరల పెంపు అనేది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. ఈ ప్రత్యేక పెంపుదల సినిమా విడుదలైన రోజు నుండి గరిష్టంగా 10 రోజుల వరకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ 10 రోజుల గడువు ముగిసిన తర్వాత థియేటర్లలో టికెట్ ధరలు యథావిధిగా సాధారణ స్థితికి వస్తాయి.
భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా సేఫ్ జోన్కు రావాలంటే భారీ వసూళ్లు సాధించాల్సి ఉన్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వ ఇచ్చిన ఈ ప్రైస్ హైక్ పర్మిషన్ ‘పెద్ది’ కలెక్షన్ల పరంగా ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి!

