Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలపై పెద్దగా శ్రద్ధ పెట్టని పవన్, ఇప్పుడు తన రూట్ మార్చారు. హైదరాబాద్‌లో జరిగిన జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇకపై తెలంగాణలో జనసేన గట్టిగా పనిచేస్తుందని, తానే స్వయంగా ఇక్కడ పర్యటించి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించారు.
కొందరు కాంగ్రెస్ నాయకులు తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమంటూ చేస్తున్న హెచ్చరికలపై పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. “తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ భారతదేశంలో ఒక భాగమని, ఇక్కడికి రావడానికి ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, జనసైనికులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై పవన్ కల్యాణ్ నేరుగా విమర్శలు గుప్పించారు. ఉత్తరాదికి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు, తాను తెలంగాణలో తిరగకూడదా అని ప్రశ్నించారు. గతంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో తనపై దాడులు జరిగినప్పుడే భయపడకుండా నిలబడ్డానని, తనపై మొదటి కేసు నమోదైంది కూడా తెలంగాణలోనేనని ఆయన గుర్తుచేశారు. “నా నాలుక కోస్తామంటున్న నాయకులకు సవాల్ చేస్తున్నా.. ఎవరొస్తారో రండి” అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణతో తనకు ఎప్పటి నుంచో బలమైన బంధం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, ఇక్కడ పార్టీకి లక్ష మందికి పైగా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, ఇక్కడి పోరాట స్ఫూర్తి అంటే తనకు ఎంతో గౌరవమని, ఆ ఇష్టమే తన సినిమాల్లోనూ కనిపిస్తుందని పేర్కొన్నారు. కేవలం రాజకీయాల కోసమే తాను కొత్తగా తెలంగాణ ప్రేమను నటింపజేయడం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్లుగా పవన్ కల్యాణ్ తన వ్యూహాన్ని మార్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం, చేసిన సంచలన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
