Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఏర్పాటు చేయాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. దీనిపై హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసినప్పటికీ అక్కడ కూడా సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైంది. దీంతో సభ రద్దు కావడంతో, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుండి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అత్యంత ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూనే, తనను అడ్డుకోవాలని చూస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ నడిబొడ్డున పుట్టిన పార్టీ జనసేన
తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ ఈరోజు కొత్తగా వచ్చింది కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం తెచ్చుకున్నది అంతకంటే కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కాదు, తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్‌లోనే పుట్టింది. ఇక్కడ లక్ష మందికి పైగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలాంటిది తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకు అని ప్రశ్నించడానికి వీళ్లెవరు?” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పటి నుండి తెలంగాణ నలుమూలలా తిరిగానని, ఇక్కడి పోరాట స్ఫూర్తిని చూసి పెరిగానని, ఆ ప్రభావం తన సినిమాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుందని గుర్తు చేశారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న వారు అసలు తెలంగాణలో ఎంతవరకు తిరిగారని ఆయన ప్రశ్నించారు.
బెదిరింపులకు భయపడం.. తెలంగాణ ఎవరి సొత్తు కాదు
హైదరాబాద్‌లో తన ప్రవేశాన్ని తప్పుబడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. “నువ్వు హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావు అని నన్ను అడుగుతున్నారు. నన్ను బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అంటూ పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. తమది ఎవరికో లొంగిపోయే ‘బాంచన్’ తత్వం కాదని, భయపడేవాడైతే అసలు రాజకీయ పార్టీనే పెట్టేవాడిని కానని చెప్పారు. తనకు తెలంగాణలో కంటే గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ బెదిరింపులు వచ్చాయని, అయినా వేటికి వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తాను ఎప్పుడూ రెచ్చగొట్టేలా మాట్లాడలేదని, ఎన్ని విమర్శలు చేసినా ఓపికగా భరించానని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం.. కబ్జా నిరూపిస్తే రాసిస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాను ఎక్కడైనా చెరువు భూమిని కబ్జా చేసినట్లు ప్రభుత్వం నిరూపిస్తే, ఆ భూమిని తానే స్వయంగా ప్రభుత్వానికి రాసిస్తానని సవాల్ విసిరారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు లేకపోతే దానికి తాను ఎలా కారణమవుతానని ప్రశ్నించారు.
ఒకప్పుడు మద్రాస్‌లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని, ఇక్కడ ఆంధ్రా వాళ్లను నిరంతరం తిడుతూ ఉంటే వాళ్లు ఎలా ప్రశాంతంగా ఉండగలరని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు వేరు, ప్రజలు వేరని గ్రహించాలని.. ఇప్పటికైనా ప్రాంతాల పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
