Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!

Mahesh Kumar Goud: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడని, సినిమా హీరోగా ఆయనపై తమకు పూర్తి గౌరవం ఉందని చెప్పారు. అయితే, రాజకీయాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడని, ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా ఏపీలోనే పుట్టిందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు.

ఆంధ్రా మూలాలు ఉన్న ఒక నాయకుడికి ఎప్పుడూ తన సొంత ప్రాంతం పైనే ప్రేమ ఉంటుందని టీపీసీసీ చీఫ్ అన్నారు. అలాంటి వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక బినామీ అడ్రస్‌తో తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానంటే కుదరదని, ఆంధ్రా ప్రాంత నాయకుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయలేడని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజల మనసుల్లో ప్రత్యేక రాష్ట్ర ఆలోచనను, ఆకాంక్షను నాటింది జయశంకర్ సార్ అని, ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎనలేని గౌరవం ఉందని చెప్పారు.

ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, కేసీఆర్ ఇద్దరూ లోపాయికారీగా కుమ్మక్కు కావడం వల్లే తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మార్చేశారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు రీ-డిజైన్ పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు బీజేపీని కానీ, బీఆర్ఎస్‌ను కానీ నమ్మే పరిస్థితిలో లేరని.. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *