Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!

Pawan Kalyan: తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, యువత బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ గడ్డతో జనసేనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఆయన ఒక సుదీర్ఘ భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు.

జనసేన శ్రేణుల్లో ఉన్నది తెలంగాణ తెగువే!

తెలంగాణ నేలతో తనకున్న ఆత్మీయ బంధాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ గడ్డపైనే జనసేన పార్టీ ఊపిరి పోసుకుంది. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పునికి పుచ్చుకుంది. అణగారిన వర్గాల సంక్షేమానికి భంగం కలిగినా.. యువత ఆకాంక్షలకు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగినా గళం వినిపించే తెగువ తెలంగాణ సమాజానికి ఉంది. సరిగ్గా అలాంటి లక్షణమే జనసేన శ్రేణుల్లోనూ ఉంది.

నా తెలంగాణ కోటి రతనాల వీణ! అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం, స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం (12 ఏళ్ల) క్రితం ఇదే రోజని ఆయన కొనియాడారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమరవీరుల త్యాగాలకు తన వినమ్ర నివాళులు అర్పించారు.

ఇక్కడి గాలిలో పౌరుషం.. నేలలో అమరుల రక్తం ఉంది

తెలంగాణ స్వాభిమాన చరితను గుర్తుచేస్తూ పవన్ కళ్యాణ్ అక్షర నివాళి అర్పించారు. తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు.. ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం అని కొనియాడారు.

రాజకీయాల కంటే మానవీయ అంశాలే ముఖ్యం

తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల తనకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు.. ఇవన్నీ కేవలం రాజకీయ అంశాలు కావు, వీటిని నేను మానవీయ అంశాలుగా భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా సరే.. అవి మన అందరి బాధ్యత అనే బలమైన నమ్మకం నాది.

అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికీ చేరాలి!

ప్రస్తుత తెలంగాణ ప్రగతిని ప్రస్తావిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను పవన్ కళ్యాణ్ వివరించారు. “ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, సామాజిక న్యాయంతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంటూ ‘జై తెలంగాణ – జై హింద్’ అంటూ పవన్ కళ్యాణ్ తన సందేశాన్ని ముగించారు.

నేడు జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ ప్రెస్‌మీట్!

రాష్ట్ర అవతరణ వేడుకల వేళ రాజకీయంగానూ ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుండి నేడు (మంగళవారం) సాయంత్రం 4:30 గంటలకు పవన్‌కల్యాణ్ మీడియా సమావేశం (Press Meet) నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ నవనిర్మాణ సభపై వస్తున్న విమర్శలు మరియు జనసేన భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పందన తెలియజేయబోతున్నారనే అంశంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *