Telangana Formation Day:

Telangana Formation Day: నేడు రాష్ట్ర అవతరణ సంబురాలు.. వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి (12వ అవతరణ దినోత్సవం) అడుగుపెడుతున్న శుభ తరుణంలో..ఈరోజు  మంగళవారం (జూన్ 2) రాష్ట్రవ్యాప్తంగా అవతరణ సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలమైన ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ సమాజం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేడుకలు.. ఈసారి టైమింగ్స్ మార్పు!

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని పరేడ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో ఈరోజు ఉదయం అధికారిక రాష్ట్ర స్థాయి వేడుకలు జరగనున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎండ తీవ్రతను (హీట్ వేవ్) దృష్టిలో ఉంచుకుని, వేడుకలకు హాజరయ్యే వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేడుకల సమయాన్ని మార్చారు.

ఉదయం 8:30 గంటల నుండి 10:00 గంటల లోపే అధికారిక కార్యక్రమాలన్నీ ముగియనున్నాయి. మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌‌‌‌‌‌‌‌పార్క్‌‌‌‌‌‌‌‌ వద్దకు చేరుకుని, తెలంగాణ అస్తిత్వం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పిస్తారు.అనంతరం ఉదయం 8:30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనూ ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ప్రజాప్రతినిధులు అధికారికంగా జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు.

ఆవిర్భావ వేదికపై నుండి ‘వరాల జల్లు’.. పథకాల ప్రారంభం ఇక్కడే:

జూన్ 2వ తేదీని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలకు, నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తూ పలు విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టనుంది:

  1. ఇందిరమ్మ ఇండ్ల పథకం (రెండో విడత): పేదవాడి సొంతింటి కల నిజం చేసే దిశగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది (ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపు 5,500 నుండి 6,500 ఇళ్లు కేటాయింపు).

  2. చేయూత పెన్షన్ల పెంపు: నిరుపేద వృద్ధులు, వితంతువులకు అండగా నిలిచేందుకు కొత్తగా మరో 2 లక్షల మంది అర్హులకు ‘చేయూత’ పెన్షన్లను మంజూరు చేయనున్నారు.

  3. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాల సామాజిక భద్రత కోసం ఈ సరికొత్త ఉచిత జీవిత బీమా పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇదే వేదికపై నుండి వెలువడనుంది.

  4. బంపర్ ఉద్యోగ నోటిఫికేషన్లు: తెలంగాణ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను ఈ శుభ సందర్భంగా విడుదల చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ భారీ ఖాళీల భర్తీ ప్రకటన చేయనున్నారు.

  5. ప్రత్యేక గ్రామ సభలు: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభల నిర్వహణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రయాణికులు అలర్ట్!

పరేడ్ గ్రౌండ్స్ వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.

బేగంపేట నుండి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను పారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్ మీదుగా మళ్లిస్తారు.తిరుమలగిరి వైపు వెళ్లే వారు సెయింట్ జాన్స్ రోటరీ, షెనాయ్, ఏఓసీ రూట్లను ఉపయోగించుకోవాలి. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర రోడ్లలోకి అనుమతించరు. వాహనదారుల సౌకర్యార్థం పోలీసులు 4 ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ (QR Code) నావిగేషన్ సపోర్ట్ ద్వారా పార్కింగ్ ప్రాంతాలను సులభంగా గుర్తించవచ్చు. సాధ్యమైనంత వరకు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.

విద్యుత్ వెలుగుల్లో చారిత్రక కట్టడాలు

తెలంగాణ అవతరణ వేడుకల కోసం హైదరాబాద్‌లోని సచివాలయం (Secretariat), అసెంబ్లీ, రాజ్‌భవన్, చార్మినార్ వంటి ఐకానిక్ భవనాలను, చారిత్రక కట్టడాలను రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గత రెండున్నరేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డిజిటల్ ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *