Kalyan Banerjee

Kalyan Banerjee: ఉద్దేశపూర్వకంగానే నాపై దాడి చేశారు..!

Kalyan Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర రాజకీయ హింస రోజురోజుకూ మరింత ముదురుతోంది. శనివారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే.. ఆదివారం హూగ్లీ జిల్లాలో మరో సీనియర్ టీఎంసీ నేత లక్ష్యంగా హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్, సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చండీతల పోలీస్ స్టేషన్ వెలుపల జరిగిన ఘర్షణలో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తలకు బలమైన గాయమైంది.

పోలీస్ స్టేషన్ ముందే హైడ్రామా.. బీజేపీ వర్సెస్ టీఎంసీ!

స్థానిక నివేదికల ప్రకారం.. అరెస్టయిన తమ పార్టీ నాయకులను, యాక్టివిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పోలీసులకు వినతిపత్రం (మెమోరాండం) సమర్పించడానికి కల్యాణ్ బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ మద్దతుదారులు చండీతల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ కార్యకర్తలు టీఎంసీ శ్రేణులను అడ్డుకున్నారు.

నిరసన తెలుపుతున్న టీఎంసీ మద్దతుదారులను ఉద్దేశించి బీజేపీ కార్యకర్తలు ‘చోర్.. చోర్’ (దొంగలు) అంటూ తీవ్రంగా నినాదాలు చేయడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, కేంద్ర భద్రతా దళాల భారీ విభాగాన్ని మోహరించి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.

ఉద్దేశపూర్వకంగానే నాపై దాడి చేశారు: ఎంపీ కల్యాణ్ బెనర్జీ

ఈ ఘర్షణలో కల్యాణ్ బెనర్జీ తలకు గాయం కావడంతో, ఆయన గాయపడిన భాగంపై తడి కర్చీఫ్‌ను పట్టుకుని నిలబడటం కనిపించింది. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తాము చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును వినియోగించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుంటే.. బీజేపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసి దాడికి తెగబడ్డారని ఆయన ఆరోపించారు. ఎలాంటి ఉసిగొల్పు లేకుండా తమపై భౌతిక దాడికి దిగడం దుర్మార్గామని మండిపడ్డారు.

అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే..

శనివారం సోనార్‌పూర్‌లో టీఎంసీ నంబర్-2 లీడర్ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి మరువక ముందే.. కల్యాణ్ బెనర్జీపై ఈ దాడి జరగడం బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. శనివారం ఎన్నికల హింసకు గురైన ఒక పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి అభిషేక్ బెనర్జీ తన కారు దిగగానే.. కొందరు పురుషులు, మహిళలతో కూడిన గుంపు ఆయనను ముట్టడించి ‘చోర్, చోర్’ అంటూ నినాదాలు చేసింది. ఆ గుంపు ఒక్కసారిగా హింసాత్మకంగా మారి రాళ్లు, గుడ్లు విసరడమే కాకుండా.. అభిషేక్‌ను చెంపదెబ్బలు కొట్టి, గుద్దినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరికి భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.

వరుసగా ఇద్దరు కీలక ఎంపీలపై 24 గంటల వ్యవధిలో దాడులు జరగడంతో బెంగాల్ రాజకీయం మరింత అగ్నిగుండంగా మారింది. ఈ దాడులపై టీఎంసీ, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *