KTR

KTR: ఆ పోరాటం అందరికీ స్ఫూర్తి.. CBSE మార్కుల వివాదంపై స్పందించిన కేటీఆర్!

KTR: సీబీఎస్‌ఈ (CBSE) మార్కుల గందరగోళంపై పోరాడుతున్న విద్యార్థులకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందనలు తెలిపారు. తప్పులను ప్రశ్నిస్తూ, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెడుతున్న విద్యార్థుల తీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

గతంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళానికి కారణమైన ఒక సంస్థే.. ఇప్పుడు సీబీఎస్‌ఈలోనూ ఇలాంటి పరిస్థితికి కారణమైందని కేటీఆర్ ఆరోపించారు. 2019లో తెలంగాణలో ఇంటర్ ఫలితాలను తారుమారు చేసిన ‘గ్లోబరీనా’ అనే సంస్థ, ఇప్పుడు తన పేరు మార్చుకుని సీబీఎస్‌ఈ నుంచి కాంట్రాక్టు దక్కించుకుందని ఆయన పేర్కొన్నారు. అక్కడ అంతకంటే పెద్ద గందరగోళాన్ని సృష్టించి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు.

గతంలో తెలంగాణలో ఈ గ్లోబరీనా సంస్థ వ్యవహారంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులను తొలగించడమే కాకుండా, ఆ సంస్థపై కోర్టులో కేసు కూడా వేసినట్లు చెప్పారు. అయితే, ఆ సంస్థకు ఉన్న చెడ్డ చరిత్రను సీబీఎస్‌ఈ పూర్తిగా విస్మరించిందని ఆయన ఆక్షేపించారు.

కేవలం ఆ అసమర్థ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసమే సీబీఎస్‌ఈ తన నిబంధనలను కూడా మార్చుకున్నట్లు కనిపిస్తోందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద గందరగోళం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని, వారు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి లోపభూయిష్టమైన వ్యవస్థలపై దేశ భవిష్యత్తును నిర్మించలేమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *