Pawan Kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయుడుపేటలోని జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించారు. చెత్తను ఉపయోగించి ఇక్కడ ఎలా విద్యుత్తును తయారు చేస్తున్నారో ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ నిర్వహణ ఎలా సాగుతోంది, దీనిని ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చయింది అనే వివరాలను అధికారులను అడిగి ఆరా తీశారు. ఇక్కడ తయారవుతున్న విద్యుత్ ఎంత, అలాగే ఒక యూనిట్ కరెంట్‌ను ఎంత ధరకు అమ్ముతున్నారు అనే విషయాలను ప్లాంట్ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు వివరంగా వివరించారు.
ఈ సందర్భంగా కాకినాడలో ఉన్న జిందాల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాకినాడ ప్లాంట్ ఇంకా ఎందుకు పని ప్రారంభించలేదని ఆయన అధికారులను ప్రశ్నించగా.. ఈ ఏడాది నవంబరు లోపు దానిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వారు పవన్‌కు సమాధానం ఇచ్చారు.
విద్యుత్ తయారీ ప్రక్రియలో వచ్చే కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ల వల్ల వచ్చే కాలుష్యం ఎంత? దానిని అదుపు చేయడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీనిపై జిందాల్ ప్రతినిధులు స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణ మండలి ఏడాదికి నాలుగు సార్లు ప్లాంట్‌ను తనిఖీ చేసి నివేదిక ఇస్తోందని ఉపముఖ్యమంత్రికి వివరించారు.
