Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మోహిని శనివారం (మే 30) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని తన నివాసంలోనే కన్నుమూశారు. తల్లి మరణంతో అజిత్ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
సికింద్రాబాద్‌తో ముడిపడిన అజిత్ జీవితం
సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమాత్రం లేకపోయినా.. కేవలం తన స్వయంకృషితోనే అజిత్ ఇండస్ట్రీలో అగ్ర స్థాయికి ఎదిగారు. నిజానికి అజిత్ పుట్టింది మన సికింద్రాబాద్‌లోనే. చిన్నప్పుడు ఆయనకు తమిళం మాట్లాడటం కూడా సరిగ్గా వచ్చేది కాదు. అయినప్పటికీ, భాష తెలియని చోట అడుగుపెట్టి, తన నటనతో కోట్లాది మంది తమిళ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్.. ప్రస్తుతం సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
సోషల్ మీడియాలో అభిమానుల నివాళులు
తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ హీరో అజిత్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన తల్లి మరణవార్త విన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అమ్మను కోల్పోయిన బాధలో ఉన్న అజిత్‌కు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సంతాపం ప్రకటిస్తున్నారు.
