Siddaramaiah

Siddaramaiah: రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ.. కొడుకు కోసం మంత్రి పదవి డిమాండ్?

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కొత్త మంత్రివర్గ కూర్పుపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సిద్ధరామయ్య తన భవిష్యత్తు రాజకీయాలతో పాటు, తన వర్గం నేతలకు పదవుల గురించి రాహుల్ ముందు పలు కీలక డిమాండ్లను ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ముఖ్యంగా తన కుమారుడు యతీంద్రకు కొత్త ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య గట్టిగా కోరినట్లు సమాచారం. యతీంద్రకు వైద్య విద్య లేదా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇవ్వాలని, లేదంటే గతంలో డీకే శివకుమార్ చూసిన పరిశ్రమలు, జలవనరుల వంటి పెద్ద శాఖల్లో ఏదో ఒకటి కేటాయించాలని ఆయన హైకమాండ్‌ను అడిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుమారుడితో పాటు తన నమ్మకస్థులకు కూడా క్యాబినెట్‌లో చోటు కల్పించాలని ఆయన పట్టుబడుతున్నారు.

ఇదే సమయంలో సిద్ధరామయ్య తన రాజకీయ భవిష్యత్తుపై కూడా క్లారిటీ ఇచ్చారు. తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజ్యసభకు వెళ్లే ఉద్దేశం అస్సలు లేదని రాహుల్ గాంధీకి స్పష్టం చేశారు. తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. అలాగే కొత్త మంత్రివర్గంలో తన వర్గానికి చెందిన ఒకరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరారు.

దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో.. రాబోయే రోజుల్లో నియమించబోయే ఎమ్మెల్సీలు, మంత్రుల పదవులకు సంబంధించి తన అనుచరుల పేర్లతో కూడిన ఒక జాబితాను సిద్ధరామయ్య రాహుల్ గాంధీకి అందజేశారు. రాహుల్‌తో చర్చలు ముగిసిన తర్వాత సిద్ధరామయ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యారు. కర్ణాటకలో కొత్త క్యాబినెట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *