Telangana: తెలంగాణ ప్రజలందరికీ ఒకే కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో జరిపిన కీలక సమీక్షలో ‘సమగ్ర సంక్షేమ కార్డు’ తీసుకురావాలని ఆదేశించారు. ఈ ఒక్క కార్డు ఉంటే చాలు, ఏ పౌరుడికి ఏ శాఖ నుండి ఎలాంటి పథకాలు అందుతున్నాయి, ఎంత డబ్బు లబ్ధి చేకూరుతోంది అనే పూర్తి వివరాలు ఒకే చోట తెలిసిపోతాయి. ప్రతి పథకానికి వేర్వేరు కార్డులు వాడే అవసరం లేకుండా, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ సరికొత్త కార్డును రూపొందించనున్నారు.
ఈ కార్డు ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సహాయంతో లబ్ధిదారుల డేటాను పరిశీలిస్తామని, దీనివల్ల నిజమైన పేదలకు, అర్హులైన వారికే పథకాలు అందుతాయని చెప్పారు. అదే సమయంలో అనర్హులను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఈ డేటా సేకరణ కోసం అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు సేకరించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక పథకాలతో పాటు విద్యా, కార్మిక శాఖల భీమా పథకాలను కూడా ఈ కార్డుకు లింక్ చేయనున్నారు. అంతేకాదు, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుతో అనుసంధానం చేస్తారు. అవసరమైతే ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి ఒక్కరికీ రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు నంబర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం చేయడమే ఈ కార్డు ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకు ఎవరైనా మరణిస్తే, వారి మరణ ధృవీకరణ పత్రం జారీ అయిన వెంటనే ఆ సమాచారం ‘చేయూత’ పెన్షన్ డేటాబేస్కు చేరుతుంది. దీనివల్ల తదుపరి చర్యలు వేగంగా జరుగుతాయి. అలాగే ప్రజల హెల్త్ ప్రొఫైల్ను కూడా దీనికి జోడించనున్నారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని కూడా సేకరించాలని ఐటీ శాఖను సీఎం ఆదేశించారు.
మరోవైపు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ కోసం కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వలస వెళ్లే వారి నైపుణ్యాలు, పాస్పోర్ట్, వీసా వివరాలన్నీ ఒకే చోట ఉంచితే నకిలీ ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు. పేదలకు ప్రభుత్వ సాయం నేరుగా, ఖచ్చితంగా అందేలా చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర సంక్షేమ కార్డును తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
