Heavy Rains

Heavy Rains: హైదరాబాద్‌కు వరుణుడి ఊరట.. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!

Heavy Rains: హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులకు వరుణుడు చల్లని కబురు చెప్పాడు. మంగళవారం అర్థరాత్రి నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చల్లని వాతావరణం ఏర్పడటంతో నగరవాసులు తీవ్ర ఎండల నుండి పెద్ద ఉపశమనం పొందారు.

పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం..

తూర్పు హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలలో నిన్న అర్థరాత్రి మంచి వర్షం కురిసింది. ముఖ్యంగా. కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిసర ప్రాంతాలు, ఎల్బీ నగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ వరకు పలు చోట్ల మోస్తరు నుండి మంచి వర్షపాతం నమోదైంది.

ఉత్తర హైదరాబాద్‌కు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక!

మరోవైపు, ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు వాతావరణ శాఖ (IMD) మరియు హెచ్ఎండీ (HMD) అధికారులు భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరికను (Weather Alert) జారీ చేశారు. కింది ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హై అలర్ట్ ప్రాంతాలు: మేడ్చల్, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బాచుపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి.

పిడుగులు పడే ఛాన్స్.. 50 కిమీ వేగంతో ఈదురు గాలులు!

ఈ వర్షాల సమయంలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనితో పాటు కొన్ని చోట్ల పిడుగులు (Lightning) పడే ప్రమాదం కూడా ఉందని, కాబట్టి వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని HMD అధికారులు స్పష్టం చేశారు.

మధ్య, పశ్చిమ ప్రాంతాలకూ విస్తరణ..

వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. మరికొద్ది గంటల్లో ఈ వర్షాలు నగరంలోని మధ్య (Central), పశ్చిమ (West) ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఉన్న సిటీ.. రాత్రికి ఒక్కసారిగా కూల్ అయిపోవడంతో నగరవాసులు ఈ చల్లని క్లైమేట్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *