CBSE: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థుల విద్యా విధానంలో బోర్డు భారీ మార్పులు తీసుకువచ్చింది. జాతీయ విద్యా విధానం (NEP-2020) మరియు నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (NCF-SE 2023) సిఫార్సులకు అనుగుణంగా రాబోయే జూలై 1 నుండి ‘త్రీ-లాంగ్వేజ్’ (మూడు భాషల) విధానాన్ని విధిగా పాటించాలని స్పష్టం చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులలో చిన్నతనం నుంచే బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.
కొత్త నిబంధనలు ఏమిటి?
నూతన నిబంధనల ప్రకారం, సీబీఎస్ఈ పరిధిలోని 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై మూడు భాషలను (R1, R2, R3) తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.
-
భారతీయ భాషలకు ప్రాధాన్యత: ఈ మూడు భాషలలో కనీసం రెండు భాషలు ఖచ్చితంగా భారతీయ మూలాలు కలిగినవి అయి ఉండాలి.
-
విదేశీ భాషల ఎంపిక: సాధారణంగా పాఠశాలల్లో ఇంగ్లీష్ మొదటి భాష (R1)గా కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ లేదా జపనీస్ వంటి విదేశీ భాషలను చదవాలనుకుంటే.. వారు అప్పటికే రెండు భారతీయ భాషలను ఎంచుకుని ఉండాలి. ఆ తర్వాతే విదేశీ భాషను మూడవ భాషగా లేదా అదనపు నాలుగవ భాషగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
విద్యార్థులు తమ పాఠశాల లేదా రాష్ట్ర లభ్యతను బట్టి తెలుగు, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ వంటి దేశీయ భాషలను ఎంపిక చేసుకోవచ్చు.
విద్యార్థులకు ఊరట.. బోర్డు పరీక్ష ఉండదు!
ఈ అదనపు భాషా విధానం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు సీబీఎస్ఈ ఒక కీలక మినహాయింపు ఇచ్చింది. మూడవ భాషకు (R3) పదో తరగతి స్థాయిలో ఎలాంటి బోర్డు పరీక్ష ఉండదు.
దీని మూల్యాంకనాన్ని పాఠశాలలే అంతర్గతంగా (Internal Evaluation) నిర్వహిస్తాయి. ఈ పరీక్షలో సాధించిన మార్కులను ఫైనల్ సీబీఎస్ఈ సర్టిఫికేట్లో పొందుపరుస్తారు. ఒకవేళ ఈ మూడవ భాషలో విద్యార్థి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. వారిని పదో తరగతి మెయిన్ బోర్డు పరీక్షలు రాయకుండా ఆపబోమని, వారు పరీక్షలకు హాజరవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
పాఠశాలల ముందున్న సవాళ్లు – పరిష్కారాలు
విద్యా సంవత్సరం అప్పటికే ప్రారంభమైనందున ఈ మార్పును అకస్మాత్తుగా తీసుకురావడంపై పలు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా టైమ్ టేబుల్ రూపొందించడం, అర్హులైన భాషా ఉపాధ్యాయుల కొరత మరియు విద్యార్థులపై సిలబస్ భారం పెరగడం వంటి ఇబ్బందులను వారు ఎత్తిచూపుతున్నారు.
ఈ సమస్యలను అధిగమించడానికి సీబీఎస్ఈ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. జూన్ 30 లోగా స్కూళ్లు తమ లాంగ్వేజ్ ఆప్షన్లను ఓయాసిస్ (OASIS) పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆదేశించింది. ఉపాధ్యాయుల కొరత ఉంటే పక్క పాఠశాలల టీచర్లను పంచుకోవడం, ఆన్లైన్ లేదా హైబ్రిడ్ క్లాసులు నిర్వహించడం మరియు రిటైర్డ్ ఉపాధ్యాయుల సేవలను వాడుకోవాలని సూచించింది. అలాగే కొత్త పుస్తకాలు వచ్చే వరకు 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రస్తుతానికి 6వ తరగతి స్థాయి పుస్తకాలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
