Bandi Sanjay: తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ఇంకా తాజా అరెస్ట్.. రిమాండ్ పరిణామాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం ఉందని పేర్కొంటూ ఆయన ఒక భావోద్వేగపూరిత ప్రకటనను విడుదల చేశారు.
తన కుమారుడు చట్టానికి గౌరవం ఇచ్చి విచారణకు హాజరయ్యాడని బండి సంజయ్ స్పష్టం చేశారు. చట్టం మరియు న్యాయవ్యవస్థపై ఉన్న అత్యంత గౌరవంతో, ఈ రోజు నా కుమారుడు బండి భగీరథ్ మా న్యాయవాదుల (Advocates) సమక్షంలో విచారణ నిమిత్తం తెలంగాణ పోలీసుల ముందుకు వెళ్లాడు అని ఆయన పేర్కొన్నారు. చట్టం నుండి తప్పించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
చట్టం ముందు అందరూ సమానులే!
ఈ కేసు విషయంలో తాను ఎలాంటి పక్షపాతానికి తావివ్వబోనని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. తప్పు చేసినవాడు నా స్వంత కుమారుడైనా లేదా ఒక సాదాసీదా సాధారణ పౌరుడైనా సరే.. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవు అని ఆయన స్పష్టం చేశారు.
భగీరథ్ నిర్దోషి.. జాప్యంపై క్లారిటీ!
తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని బండి సంజయ్ సమర్థించుకున్నారు.
-
నిర్దోషిత్వం: తాను ఎటువంటి పొరపాటు చేయలేదని భగీరథ్ మొదటి నుండి గట్టిగా చెబుతున్నాడని సంజయ్ పేర్కొన్నారు.
-
లీగల్ టీమ్ సలహా: తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ న్యాయ నిపుణుల ముందు ఉంచామని, ఈ సమస్యను చట్టపరమైన ప్రక్రియ ద్వారానే సరైన రీతిలో పరిష్కరించుకోవచ్చని లాయర్లు సలహా ఇచ్చారని తెలిపారు.
-
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ: ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణలు జరుగుతున్నాయని, వచ్చే వారం దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. దర్యాప్తుకు సహకరించడంలో తమ వైపు నుండి ఎలాంటి సంకోచం లేదా ఆలస్యం ఉండకూడదనే ఉద్దేశంతోనే పోలీసుల ముందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు.
న్యాయం ఆలస్యం కావచ్చు.. కానీ లభించకుండా పోదు!
భారతీయ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని బండి సంజయ్ భరోసా వ్యక్తం చేశారు. నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొంటూ.. “న్యాయం జరగడంలో కొంత ఆలస్యం కావచ్చు, కానీ న్యాయం లభించకుండా మాత్రం పోదు” అని రాసుకొచ్చారు.
చివరగా ఆయన భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలోని అత్యంత ప్రసిద్ధ శ్లోకమైన “ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్” (తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ, తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు) అనే వాక్యంతో తన ట్వీట్‌ను ముగించారు.

