Petrol-Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఆకాశాన్ని తాకనున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన ధరల పెంపు అనివార్యమని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు, ఈ పెట్రో ధరల పెంపు కోలుకోలేని దెబ్బ కానుంది. యుద్ధ వాతావరణం, రవాణా ఖర్చులు పెరగడంతో ఆయిల్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలోని ఆయిల్ కంపెనీలు సుమారు లక్ష కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక బ్యారల్ ముడిచమురు ధర ప్రస్తుతం 105 డాలర్లు ఉండగా, అది త్వరలోనే 120 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధరలు పెంచడం ఒక్కటే మార్గమని ఆయిల్ కంపెనీలు కేంద్ర ఆర్థిక శాఖకు స్పష్టం చేశాయి.
లీటర్ పెట్రోల్, డీజిల్ పై కనీసం 4 నుంచి 5 రూపాయల వరకు పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి కూడా ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల నష్టం వస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ధరల పెంపుతో పాటు దేశంలో ఇంధన వినియోగం తగ్గాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి పప్పులు, కూరగాయల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఏ క్షణమైనా ధరల పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
