Marriage

Marriage: పెళ్ళిలో గొడవ.. ముగ్గురికి గాయాలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Marriage: గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లి చూడడానికి బంధువులు, మిత్రులు చాలామందే వచ్చారు. నవదంపతులతో ఫోటోలు దిగుతున్నారు. మండపం మొత్తం ఫుల్ హడావిడిగా, సంబరంగా ఉంది. కానీ అదే సమయంలో కొంతమంది తలకాయలు పగిలి మండపంలోకి వచ్చారు. అది చూసి అందరూ షాక్. పక్కనే భోజనాల వైపు చూస్తే బంధువులందరూ గొడవ పడుతూ, తిట్టుకుంటూ ఉన్నారు. ఇంత పెద్ద గొడవకి కారణం ఏంటని ఆరా తీసి నిజం తెలుసుకుంటే అందరూ షాక్. ఎందుకో తెలుసా? ఉప్పు కోసం గొడవ జరిగింది. అది కూడా తలకాయలు పగలకొట్టుకునేంత!

అసలు ఏం జరిగిందంటే..

మార్కాపురం జిల్లా, గిద్దలూరు మండలం, బురుజుపల్లికి చెందిన యువకుడికి అదే ఊరికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఈ వేడుకలో భోజనాలు వడ్డిస్తుండగా సాంబార్‌లో ఉప్పు తగ్గిందని కొంతమంది చెప్పారు. వడ్డించే ఆయన, “కొంతమంది ఉప్పు ఎక్కువగా, కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి ఉప్పు కొంత తక్కువగా వేశాము” అని చెబుతూ పక్కనే ఉన్న ఉప్పు గిన్నెను చూపించారు.

అందులో స్పూన్ లేకపోవడంతో పెట్టాలని చెప్పారు. స్పూన్ వచ్చే దాకా కూడా ఆగలేక పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి తనే చేతితో ఉప్పు వేసుకున్నాడు. ఇక్కడే గొడవ మొదలైంది. “స్పూన్ వచ్చే దాకా కూడా ఆగలేకపోతున్నారా?” అని అనడంతో మాట మాట పెరిగి ఇరు వర్గాలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ ఘర్షణలో ఓ మహిళకి, ఇద్దరు వ్యక్తులకీ తలకాయలకి గాయాలు కావడంతో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవ పైన ఆరా తీశారు.

ఆశ్చర్యపోతున్న బంధువులు

పెళ్లి అంటేనే చిన్న చిన్న గొడవలు సహజం. ఎక్కువ సార్లు భోజనాల దగ్గరే గొడవలు జరుగుతాయి. ముక్కలు తక్కువ పడ్డాయని, మర్యాదలు సరిగా చేయలేదని గొడవలు పడటం మామూలే. కానీ ఉప్పు కోసం గొడవలు జరగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. “ఇలాంటి గొడవ ఏ పెళ్లిలో చూడలేదు” అని బంధువులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *