PM Modi: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార వేదికపై ఒక అద్భుతమైన దృశ్యం అందరినీ కదిలించింది. వేదికపై ఉన్న 97 ఏళ్ల ఓ వృద్ధుడిని చూసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని ఆత్మీయంగా హత్తుకున్నారు. దేశ ప్రధాని అంతటి గౌరవం ఇచ్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు.. బీజేపీ తొలి తరం నేత, ‘సిలిగురి సింహం’గా పిలవబడే మఖన్ లాల్ సర్కార్. ఆయన చరిత్ర వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవక మానదు.
మఖన్ లాల్ సర్కార్ గారు జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి అత్యంత సన్నిహితుడు. 1952లో ముఖర్జీ గారు కశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి వెళ్లినప్పుడు ఆయన వెంట వెళ్లిన అతికొద్ది మంది ధైర్యవంతుల్లో మఖన్ లాల్ ఒకరు. ఆ సమయంలోనే ఆయన అరెస్టు కూడా అయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఒక దేశభక్తి గీతాన్ని పాడినందుకు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తే.. కోర్టులో క్షమాపణలు చెప్పడానికి నిరాకరించి తన నిజాయితీని చాటుకున్నారు. అప్పట్లో ఆయన ధైర్యానికి ముగ్ధుడైన జడ్జి, స్వయంగా పోలీసుల చేతే ఆయనకు ఇంటికి వెళ్లడానికి ఖర్చులు ఇప్పించడం ఒక సంచలనం.
బీజేపీ అభివృద్ధిలో మఖన్ లాల్ కృషి వెలకట్టలేనిది. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత కేవలం ఒక్క ఏడాదిలోనే 10 వేల మంది సభ్యులను పార్టీలో చేర్పించిన ఘనత ఆయనది. పార్టీ నిబంధనల ప్రకారం ఎవరైనా రెండేళ్లు మాత్రమే పదవిలో ఉండాలి, కానీ ఆయన క్రమశిక్షణ, నిబద్ధత చూసి వరుసగా ఏడేళ్ల పాటు సిలిగురి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించారు. అంటే పార్టీలో ఆయనకు ఎంతటి గౌరవం ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు.
97 ఏళ్ల వయసులోనూ దేశభక్తికి నిలువెత్తు రూపంగా నిలిచిన మఖన్ లాల్ సర్కార్కు ప్రధాని మోడీ ఇచ్చిన ఈ గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ కోసం రక్తం చెందించిన పాతతరం కార్యకర్తలకు బీజేపీ ఇచ్చే విలువకు ఈ సంఘటన ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తరం మారినా ఆదర్శాలు మారవని మోడీ మరోసారి నిరూపించారు.
