Karimnagar: కరీంనగర్ నగరంలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలు పెద్ద గొడవకు దారితీశాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడికి దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేయడమే కాకుండా, కార్యాలయంలోని ఫర్నీచర్‌ను కూడా చిందరవందర చేశారు.
దాడి జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీసులోనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు ఆయన్ని సురక్షితంగా లోపలి గదిలోకి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అయితే ఈ దాడిని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే?
ముందుగా మే 7న ఉదయం పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా బండి సంజయ్ నగరాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బండి సంజయ్ ఆఫీస్ దగ్గరే దోపిడీ జరిగినా ఆయన స్పందించకపోవడం విచారకరమని, ఆయన కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, గతంలో తన దగ్గర డబ్బులు లేవని చెప్పిన బండి సంజయ్.. కార్పొరేషన్ ఎన్నికల్లో రూ. 50 కోట్లు ఎక్కడి నుండి తెచ్చి ఖర్చు చేశారని కౌశిక్ రెడ్డి నిలదీశారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని, బండి సంజయ్ కూడా ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలే బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని కలిగించి, క్యాంప్ ఆఫీస్ ముట్టడికి దారితీశాయి.
