Vijay Salary: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రజల నుంచి అఖండ మద్దతు పొందిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్, రేపు (మే 7) తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ కూటమి లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి 108 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించిన టీవీకే, ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుతో మెజారిటీని నిరూపించుకుని పగ్గాలు చేపట్టబోతోంది.
తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు ప్రజా సేవ కోసం తన గ్లామర్ ప్రపంచాన్ని వదిలి వెండితెర నుంచి కోట (సచివాలయం) వైపు అడుగులు వేస్తున్నారు. ఒక నటుడిగా శిఖరాగ్రాన ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి రావడమే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుండటం గమనార్హం.
రూ. 500 నుండి లక్షల జీతం వరకు..
విజయ్ సినీ ప్రయాణం ఇంకా ఆర్థిక మార్పులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి:
విజయ్ తన మొదటి సినిమా ‘వెట్రి’కి కేవలం రూ. 500 పారితోషికం మాత్రమే తీసుకున్నారు. కానీ అయన ఆఖరి సినిమా ‘జన నాయకన్’ కోసం సుమారు రూ. 220 నుండి 275 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు.
గత ఐదారు ఏళ్లుగా ఏడాదికి కనీసం రూ. 150 నుండి 200 కోట్ల వరకు ఆదాయం పొందుతున్న విజయ్, ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయాల కోసం సినిమా రంగాన్ని వదిలేశారు. ముఖ్యమంత్రిగా ఆయన నెలకు కేవలం రూ. 2,05,000 జీతం మాత్రమే అందుకోనున్నారు. అంటే ఏడాదికి ఆయనకు వచ్చే వేతనం సుమారు రూ. 24.6 లక్షలు మాత్రమే.
ముఖ్యమంత్రిగా భారీ లక్ష్యాలు
కేవలం అధికారం కోసం కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం విజయ్ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టమైన లక్ష్యాలను ప్రకటించారు. ముఖ్యంగా 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. ఈ మహత్కార్యంతో పాటు ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రభుత్వం నుంచి పలు వసతులు కల్పించబడతాయి.
ప్రభుత్వ అధికారిక నివాసం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇంకా జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత లభిస్తుంది. విజయ్ కి ఆయన కుటుంబానికి ఉచిత వైద్య బీమా వసతి ఉంటుంది. పర్యటనల కోసం ప్రత్యేక హెలికాప్టర్, విమాన ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. నివాస మరియు కార్యాలయ సిబ్బంది వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
విజయ్ ఆస్తుల వివరాలు
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆయన పేరిట ఉన్న చరాస్తుల(పర్సనల్ ప్రాపర్టీ) విలువ సుమారు రూ. 404 కోట్లు.స్థిరాస్తుల (భూమి, భవనాలు, ఇళ్లు, ఫ్లాట్లు) వంటి వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 220.15 కోట్లుగా పేర్కొన్నారు. ఇవే కాకుండా రూ. 76 కోట్ల మేర ఇతరులకు అప్పులు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
వందల కోట్ల ఆదాయం ఇచ్చే సినీ రంగాన్ని పూర్తిగా వీడి, ప్రజా సేవకు అంకితమైన విజయ్ రేపు బాధ్యతలు చేపట్టనుండటంతో తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం మొదలవుతుందని అభిమానులు, ప్రజలు ఆశిస్తున్నారు.
