Mamata Banerjee

Mamata Banerjee: బీజేపీ ఓట్లను దోచుకుంది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఒక పద్ధతి ప్రకారం కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే మొదట తమకు అనుకూలమైన ఫలితాలను చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామాలు తానూ ముందే ఊహించానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన పార్టీ కార్యకర్తలు పులిపిల్లల్లా పోరాడతారని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ మమతా బెనర్జీ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ పేరుతో భారీగా ఓట్లను దోచుకుందని ఆమె మండిపడ్డారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కుమ్మక్కై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంసీని అణిచివేయడానికి పార్టీ కార్యాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దని మమతా పిలుపునిచ్చారు. మొదటి రెండు మూడు రౌండ్లలో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు వచ్చేలా చేయడం వారి పన్నాగమని, ఆ తర్వాతే టీఎంసీ ఓట్లు బయటపడతాయని ఆమె వివరించారు. సుమారు 100 నియోజకవర్గాల్లో కొన్ని రౌండ్ల లెక్కింపు తర్వాత కావాలనే ప్రక్రియను నిలిపివేశారని ఆమె ఆరోపించారు.

చివరికి గెలుపు తమదేనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేవలం మూడు నాలుగు రౌండ్ల ఫలితాలను చూసి కార్యకర్తలు, ఏజెంట్లు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇంకా చాలా రౌండ్ల లెక్కింపు మిగిలి ఉందని గుర్తు చేశారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి విజయం కచ్చితంగా తృణమూల్ వశమవుతుందని, తమ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *