NDMA: మే 2వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి పెద్దగా సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉంది. మీ ఫోన్ నుంచి అకస్మాత్తుగా ఇటువంటి శబ్దం వస్తే అస్సలు భయపడకండి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ముఖ్యమైన పరీక్ష (డ్రిల్) మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ‘అత్యవసర హెచ్చరిక వ్యవస్థ’ను పరీక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA), టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్తంగా ఈ ‘సాచెట్’ (SACHET) అనే వ్యవస్థను అభివృద్ధి చేశాయి. భవిష్యత్తులో వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో ప్రజలకు సమాచారం చేరవేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని పనితీరును మరోసారి పరిశీలిస్తున్నారు.
మే 2న మీ మొబైల్కు ‘ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ పేరుతో ఒక సందేశం వస్తుంది, దాంతో పాటు పెద్దగా సైరన్ మోగుతుంది. ఇది కేవలం వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు పంపే ‘టెస్ట్ మెసేజ్’ మాత్రమే. కాబట్టి ఆ మెసేజ్ చూసి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి రియాక్షన్ ఇవ్వనక్కర్లేదు. కేవలం ఆ మెసేజ్ చూసి వదిలేస్తే సరిపోతుంది.
ఈ సాంకేతికత ద్వారా విపత్తు సంభవించే ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ఒకేసారి అలర్ట్స్ పంపవచ్చు. ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా సైరన్ మోగేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల ప్రమాద సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. రేపు మీ ఫోన్ మోగినా అది మీ భద్రత కోసమేనని గుర్తించి అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
