Tandur

Tandur: ప్రేమ విరోధిగా మారిన తల్లి.. తాండూరులో క్షుద్రపూజల కలకలం.. అసలేం జరిగిందంటే?

Tandur: కన్నకూతురు సుఖంగా ఉండాలని కోరుకోవాల్సిన ఒక తల్లి, ఆమె ప్రేమ విఫలం కావాలని ఏకంగా చేతబడి చేయించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలనం సృష్టించింది. పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మూఢనమ్మకాలతో సొంత రక్తం అని కూడా చూడకుండా తల్లి చేసిన పని ఇప్పుడు పట్టణమంతా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఇందిర అనే యువతి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అయితే, ఈ ప్రేమ వ్యవహారం ఇందిర తల్లి సాయమ్మకు అస్సలు ఇష్టం లేదు. తన కూతురు ప్రేమ పెటాకులు కావాలని, ఆ అబ్బాయికి తన కూతురు దూరమవ్వాలని భావించిన సాయమ్మ.. దారి తప్పి క్షుద్రపూజల వైపు మళ్ళింది. ఈ క్రమంలో తాండూరు పట్టణానికి చెందిన ఒక మంత్రగాడిని సంప్రదించి, తన కూతురికి చేతబడి చేయించాలని ప్లాన్ వేసింది.

పథకం ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో ఇంద్రానగర్ కాలనీలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తన కూతురిని తీసుకెళ్లింది. అక్కడ మంత్రగాడు యువతిని కూర్చోబెట్టి క్షుద్రపూజలు మొదలుపెట్టాడు. అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న కాలనీవాసులు ఈ దృశ్యాన్ని చూసి అనుమానంతో అక్కడికి చేరుకున్నారు. ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. తల్లి చేస్తున్న పని తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయి, ఆ మంత్రగాడికి దేహాశుద్ధి చేశారు.

ఈ గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న తాండూరు పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాలనీవాసుల జోక్యంతో ఈ ఉదంతం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ప్రేమను అంగీకరించకపోయినా పరవాలేదు కానీ, ఇలా ప్రాణాలకు ముప్పు తెచ్చే క్షుద్రపూజలు చేయించడం ఏంటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *