Nadendla Manohar: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. నిల్వలు ఉన్నప్పటికీ స్టాక్ లేదని సాకులు చెబుతూ సామాన్యులను ఇబ్బంది పెట్టే బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించి ఇంధనాన్ని పక్కదారి పట్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల కోసం కేటాయించిన 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు పెద్ద సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కొన్ని చోట్ల బల్క్ ఆర్డర్ల పేరిట ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా మెరుగుపడిందని, ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్‌లు వేగంగా అందుతున్నాయని మంత్రి వివరించారు. కొరతను అధిగమించడానికి ఇప్పుడు అమలు చేస్తున్న రేషన్ విధానం మంచి ఫలితాలను ఇస్తోందని, పరిస్థితి పూర్తిగా చక్కబడే వరకు ఇదే పద్ధతి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అన్ని బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, సాగు పనుల్లో ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి ప్రత్యేకంగా సూచించారు. ముఖ్యంగా ఆక్వా రైతులు, రబీ కోతలకు అవసరమైన డీజిల్ సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇంధనం అందేలా చూడాలన్నారు. సోషల్ మీడియాలో ఇంధన కొరతపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కూడా నిఘా ఉంచాలని, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.
