Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సాంకేతిక చరిత్రలో నేడు ఒక మరుపురాని రోజని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఏపీకి రావడం కేవలం విశాఖకే కాకుండా, మొత్తం రాష్ట్రానికే ఒక ‘గేమ్ ఛేంజర్’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుత అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, గూగుల్ సంస్థకు ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే రోజుల్లో టెక్నాలజీ హబ్‌గా తర్లువాడ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన గూగుల్, నేడు భారతదేశ అభివృద్ధికి ‘గ్రోత్ ఇంజిన్’గా మారిందని కొనియాడారు. ఈ ఏఐ డేటా సెంటర్ ఒక గిగావాట్ సామర్థ్యంతో పనిచేస్తుందని, దీనివల్ల భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందని వివరించారు. కొత్త ఆవిష్కరణలకు ఏపీ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని, రాష్ట్రం టెక్నాలజీ రంగంలో సగర్వంగా తలెత్తుకునే రోజులు వచ్చేశాయని చెప్పారు.
ఈ భారీ ప్రాజెక్టును గూగుల్ సంస్థ, అదానీ మరియు ఎయిర్టెల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో చేపడుతుండటం విశేషమని సీఎం అన్నారు. గూగుల్ వద్ద ఉన్న ఆధునిక ఆలోచనలు, ఏపీ ప్రభుత్వానికి ఉన్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన చెప్పారు. 2028 సెప్టెంబర్ నాటికి ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే అంతకంటే రెండు మూడు నెలల ముందుగానే పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కీలక విషయాలను కూడా ముఖ్యమంత్రి పంచుకున్నారు. ఈ ఏడాది జూలైలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము కేవలం ఒప్పందాలకే (MoU) పరిమితం కాకుండా, ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురావడంలో ముందుంటామని నిరూపించామన్నారు. జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కానుండటం శుభపరిణామమని, పెట్టుబడుల రాకతో ఏపీ మళ్ళీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చంద్రబాబు స్పష్టం చేశారు.
