Ashwini Vaishnaw: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంపై కేంద్ర ఐటీ మరియు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన వేదికగా ఆయన ఏపీ భవిష్యత్తుపై పలు ఆసక్తికర ప్రకటనలు చేశారు. ఇకపై విశాఖపట్నం కేవలం సాగర నగరం మాత్రమే కాదని, అది ‘ఏఐ పట్నం’గా పిలవబడుతుందని ఆయన అభివర్ణించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో ఈ ఏఐ డేటా సెంటర్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభమవుతుందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుపై మంత్రి స్పష్టతనిచ్చారు. 2026 జూన్ 1వ తేదీన ఈ కొత్త రైల్వే జోన్‌ను అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు ప్రకటించి ఏపీ ప్రజలకు తీపి కబురు అందించారు. విభజన హామీలను నెరవేర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, గూగుల్ సంస్థ విశాఖ నుంచి మూడు సబ్‌సీ కేబుల్స్ (సముద్రగర్భ కేబుల్స్) వేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. దీనివల్ల విశాఖ నగరం ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా వంటి దేశాలతో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందబోతోంది.
రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేటాయింపుల విషయంలో గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను మంత్రి వివరించారు. ఉమ్మడి ఏపీలో కేవలం రూ. 886 కోట్లుగా ఉన్న రైల్వే బడ్జెట్‌ను, ప్రస్తుతం ఏపీకి ఏకంగా రూ. 10,134 కోట్లకు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని, 74 స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఏపీలో ఇప్పటికే 16 వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయని, త్వరలోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ రాబోతోందని ప్రకటించారు. ఈ రైలు ద్వారా కేవలం 70 నిమిషాల్లోనే హైదరాబాద్ చేరుకోవచ్చని, అలాగే అమరావతి – చెన్నై మధ్య కూడా బుల్లెట్ రైలు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
భారత్ ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో రారాజుగా మారుతోందని మంత్రి అన్నారు. దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్లు విదేశాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయని, సెమీ కండక్టర్ తయారీలో కూడా మనం ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. గూగుల్ సంస్థ తన సర్వర్లు మరియు చిప్‌లను కూడా భారత్‌లోనే తయారు చేయాలని, ఈ సందేశాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు చేరవేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని అశ్వినీ వైష్ణవ్ భరోసా ఇచ్చారు.
